మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 21, 2020 , 20:20:19

ఖలీదా నా హ‌త్య‌కు కుట్ర చేశారు: బ‌ంగ్లా ప్ర‌ధాని

ఖలీదా నా హ‌త్య‌కు కుట్ర చేశారు: బ‌ంగ్లా ప్ర‌ధాని

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణ చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత ఖలీదా జియా, ఆమె పెద్ద కుమారుడు తారెక్ రహమాన్ 2004లో తనను హత్య చేయాలనుకున్నారని ఆరోపించారు. అవామీ లీగ్ ఢాకాలోని బంగబంధు ఎవెన్యూలో 2004 ఆగస్టు 21న ఉగ్రవాద వ్యతిరేక సభను  నిర్వహించింది. ఈ సభ జరుగుతుండగా ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో అప్పటి మొహిలా అవామీ లీగ్ అధ్య‌క్షుడు, బంగ్లాదేశ్ మాజీ అధ్య‌క్షుడు అయిన‌ జిల్లుర్ రహమాన్ సతీమ‌ణి ఇవీతోపాటు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 500 మందికిపైగా గాయపడ్డారు.

శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా అప్ప‌టి దారుణ సంఘటనను గుర్తుచేసుకున్నారు. బంగబంధు ఎవెన్యూపై జరిగిన గ్రెనేడ్ దాడిలో తనను హత్య చేయాలని ఖలీదా జియా, ఆమె పెద్ద కుమారుడు తారెక్ రహమాన్ ప్రయత్నించారని చెప్పారు. వాళ్ళ ప్రధాన లక్ష్యం తానేనని అన్నారు. ఆ దాడి జరగడానికి ముందు ఖలీదా జియా మాట్లాడుతూ అవామీ లీగ్ వందేండ్ల‌ వరకు అధికారంలోకిరాదని చెప్పిన విష‌యాన్ని గుర్తుచేసుకున్నారు. 

హత్యలు చేయడం వాళ్ళకి అలవాటని, దేశ స్వాతంత్ర్యంపై వారికి నమ్మకం లేదన్నారు. విముక్తి యుద్ధం స్ఫూర్తిని వారు విశ్వసించడం లేద‌ని విమ‌ర్శించారు. వారి దృష్టిలో అధికారం అంటే అవినీతితో డబ్బు సంపాదించే సాధనమని మండిపడ్డారు. అప్పటి బీఎన్‌పీ-జమాత్ ప్రభుత్వం ఉగ్రవాదులను చేరదీసిందని ఆరోపించారు. ఆ గ్రెనేడ్ దాడిలో తాను మరణించానని అప్ప‌టి ప్రభుత్వం భావించింద‌ని, అయితే ఆ వెంట‌నే తాను మరణించలేదన్న విష‌యం తెలిసి ఉగ్రవాదులను దేశం దాటించార‌ని షేక్ హ‌సీనా చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo