గురువారం 02 జూలై 2020
International - Jun 02, 2020 , 15:58:23

ట్రంప్‌ నోరు మూసుకో: హ్యూస్టన్‌ పోలీస్‌ చీఫ్‌

ట్రంప్‌ నోరు మూసుకో: హ్యూస్టన్‌ పోలీస్‌ చీఫ్‌

వాషింగ్టన్‌: నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ పోలీసుల చెరలో చనిపోవడాన్ని నిరసిస్తూ అమెరికాలో ఆందోళనలు మిన్నంటాయి. అమెరికాలోని దాదాపు అన్నిరాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. వైట్‌హైజ్‌ను దిగ్బంధించేందుకు ప్రయత్నించడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బంకర్‌లోకి వెళ్లిపోయారు.

అంతకుముందుకు నిరసనకారులను ఉద్దేశించి ట్విట్టర్‌లో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లుగా తయారయ్యాయి. లూటింగ్‌ మొదలైతే.. షూటింగ్‌ తప్పదని హెచ్చరిస్తూ ట్రంప్‌ గత వారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

దీనిపై టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ నగర పోలీస్‌ చీఫ్‌ ఆర్ట్‌ అసేవెడో కాస్త గట్టిగానే జవాబిచ్చారు. ట్రంప్‌ నోరు మూసుకోవాలంటూ సూచన చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల నిరసనకారుల ఆగ్రహం ఇంకా పెరుగుతుందని, ఇలా వ్యాఖ్యలు చేయడం వారిని రెచ్చగొట్టడమే అవుతుందన్నారు.

నిరసనకారులను రెచ్చగొట్టకుండా ట్రంప్‌ నోరు మూసుకొని ఉంటే పదివేలని సూచించారు. ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటానికి బదులుగా ఏదైనా నిర్మాణాత్మక కార్యక్రమం ప్రకటిస్తే బాగుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఫారెస్ట్‌ గంప్‌ సినిమాలోని 'మీకు చెప్పడానికి ఏమీ లేకపోతే.. చెప్పకండి' అనే డైలాగ్‌ను అసేవెడో ఉటంకించారు.

ఇలాఉండగా, సోమవారం వివిధ రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ట్రంప్‌.. అక్కడ కూడా ఇదే మాదిరి వ్యాఖ్యలు చేశారు. 'మీరు చాలా బలహీనంగా ఉన్నారు.. నిరసనకారులపై పైచేయి అనిపించుకోండి.. లేకపోతే ఇదంతా సమయం వృథా చేయడమే.. మీరిలాగే ఉంటే వారు మీపైకెక్కి నాట్యం చేస్తారు' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.


logo