సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 30, 2020 , 17:54:47

కవ్కాజ్-2020 లో భారత్ పాల్గొనదు

కవ్కాజ్-2020 లో భారత్ పాల్గొనదు

న్యూఢిల్లీ : బహుళజాతి సైనిక వ్యాయామం కవ్కాజ్-2020 లో భారత సైన్యం పాల్గొనడంలేదు. కవ్కాజ్ కు తమ బృందాన్ని పంపేది లేని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. కవ్కాజ్-2020 ని రష్యాలో నిర్వహిస్తున్నారు. ఈ బహుళజాతి సైనిక వ్యాయామంలో రష్యాతోపాటు చైనా, పాకిస్తాన్ దళాలు పాల్గొంటున్నాయి.

"రష్యా, భారతదేశం ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వాములు. రష్యా ఆహ్వానం మేరకు భారత్ అనేక అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నది. అయినప్పటికీ కొవిడ్-19, వ్యాయామంలో ఇబ్బందులు ఉన్నందున ఈ ఏడాది నిర్వహిస్తున్న కవ్కాజ్-2020 లో పాల్గొనకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.

జూన్ 15 న తూర్పు లడఖ్ పరిధిలోని గల్వాన్ లోయలో భారత్-చైనా ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది చైనా సైనికులు మరణించారు మరియు గాయపడ్డారు.

షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి సెప్టెంబర్ 4-6 తేదీలలో రక్షణ మంత్రి రష్యాను సందర్శించనున్నారని, అయితే భారత ప్రతినిధి తన చైనా ప్రత్యర్థితో ఎలాంటి చర్చలు జరిపే అవకాశం లేదని ఆయా వర్గాలు తెలిపాయి. కవ్కాజ్ -2020 కోసం సెప్టెంబరులో దక్షిణ రష్యాకు సుమారు 200 మంది సిబ్బందితో ట్రై-సర్వీసెస్ వ్యాయామంలో పాల్గొనడానికి రష్యా భారతదేశాన్ని ఆహ్వానించింది. దక్షిణ రష్యాలోని ఆస్ట్రాఖాన్ ప్రావిన్స్‌లో ఈ వ్యాయామం జరుగనున్నది. ఈ మిలటరీ ఎక్సర్సైజ్లో షాంఘై సహకార సంస్థ, మధ్య ఆసియా దేశాల సభ్య దేశాలు పాల్గొంటాయి.


logo