గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 09:34:08

అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి.. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా క‌మ‌లా హారిస్‌

అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి.. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా క‌మ‌లా హారిస్‌

హైద‌రాబాద్‌: భార‌తీయ సంత‌తికి చెందిన క‌మ‌లా హారిస్‌.. అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డ‌నున్నారు.  డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున ఆమె వైస్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి పోటీ చేస్తారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ఈ న‌వంబ‌ర్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీప‌డుతున్నారు. ఆయ‌న‌కు వీపీగా క‌మ‌లా హారిస్ పోటీలో ఉంటారు.  ఒక‌ప్పుడు అధ్య‌క్ష హోదా కోసం ఇద్ద‌రూ పోటీప‌డ్డారు. కానీ ఇప్పుడు క‌మ‌లా హారిస్‌కు .. జోసెఫ్ బైడెన్ ఛాన్సు ఇచ్చారు.  కాలిఫోర్నియా సేనేట‌ర్ అయిన‌ క‌మ‌లా హారిస్‌కు.. భార‌తీయ‌-జ‌మైకా వార‌స‌త్వ మూలాలు ఉన్నాయి.  దేశ‌వ్యాప్తంగా పోలీసు సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని ఇటీవ‌ల కాలిఫోర్నియా మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ క‌మ‌లా హారిస్ డిమాండ్ చేశారు. న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో.. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం డోనాల్డ్ ట్రంప్‌తో బైడెన్ పోటీప‌డ‌నున్నారు.  

రిప‌బ్లిక‌న్ నేత మైక్ పెన్స్‌.. ఆ పార్టీ నుంచి ఉపాధ్య‌క్ష పోటీకి నిల‌బ‌డుతున్నారు. అయితే హారిస్‌, పెన్స్ మ‌ధ్య అక్టోబ‌ర్ 7వ తేదీన తొలి చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ది.  ఉటావ్‌లోని సాల్ట్ లేక్ సిటీలో ఆ చ‌ర్చ ఉంటుంది. గ‌తంలో అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఇద్ద‌రు మ‌హిళ‌లు పోటీప‌డ్డారు.  2008లో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున సారా పాలిన్‌,  1984లో డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున గెరాల్డైన్ ఫెర‌రో పోటీలో నిలుచున్నారు. అయితే ఈ ఇద్ద‌రిలో ఎవ‌రూ గెల‌వ‌లేదు.  తొలిసారి ఆఫ్రికా-ఆసియా జాతికి చెందిన మ‌హిళ‌.. ఉపాధ్య‌క్ష పోటీకి నిలుచుంటున్నారు. అమెరికా రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ‌లు ఎవ‌రూ అధ్య‌క్షులు కాలేదు. క‌మ‌లా హారిస్‌ను నెంబ‌ర్ టూగా ప్ర‌క‌టించ‌డం త‌న‌కు గొప్ప గౌర‌వంగా ఉంద‌ని బైడెన్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. 
logo