వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ప్రతి ఒక అమెరికన్‌ను తీసుకువస్తామని ఆ దేశాధ్యక్షుడు బైడెన్ ( Joe Biden) తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ అని ఆయన అన్నారు. ఇదో అతి పెద్ద, అత్యంత సంక్లిష్టమైన తరలింపు అని జో బైడెన్ తెలిపారు. వైట్‌హౌజ్ నుంచి జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే తుది ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు ఏమీ హామీ ఇవ్వలేన్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించిన తీరు విషయంలో అమెరికా వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాలిబన్ ఆక్రమిత కాబూల్ నుంచి అమెరికన్లను, ఇతర విదేశీయులను తరలించడం ఓ పెను ప్రమాద ఆపరేషన్‌గా మారిందన్నారు. అమెరికా వైమానిక విమానాల్లో ఇప్పటి వరకు 13 వేల మందిని తరలించినట్లు ఆయన చెప్పారు. ఆఫ్ఘన్లో ఎంత మంది అమెరికన్లు ఉన్నారో తమ ప్రభుత్వానికి తెలియదని బైడెన్ తెలిపారు. కానీ అమెరికన్లు ఎవరైనా స్వదేశం రావాలనుకుంటే, వారిని కచ్చితంగా ఇంటికి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.