సోమవారం 06 జూలై 2020
International - Jun 30, 2020 , 16:32:55

డెమెసిస్టో ప్రజాస్వామ్య గ్రూపునకు జోష్వ వాంగ్‌ రాజీనామా

డెమెసిస్టో ప్రజాస్వామ్య గ్రూపునకు జోష్వ వాంగ్‌ రాజీనామా

హాంగ్‌కాంగ్‌: వివాదాస్పద హాంకాంగ్‌ జాతీయ భద్రతా చట్టాన్ని చైనా ఆమోదించడంతో అక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హాంకాంగ్‌లోని ప్రధాన ప్రజాస్వామ్య అనుకూల గ్రూపు అయిన డెమెసిస్టోకు ఉద్యమకారుడు జోష్వవాంగ్‌తోపాటు నాథన్‌ లా, జెఫ్రె ఎన్గో, ఆగ్నస్‌ చో రాజీనామా చేశారు. సోష‌ల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌ ద్వారా వారు ఈ ప్రకటన చేశారు. చైనా శాసనసభ హాంకాంగ్‌లో వేర్పాటు, అణచివేత, ఉగ్రవాదం, విదేశీ జోక్యాన్ని నేరపరిచే చట్టాన్ని ఆమోదించిన రెండు గంటల తర్వాత వారు ఈ ప్రకటన చేసినట్లు హాంకాంగ్ ప్రెస్ ఫ్రీ పేర్కొంది.

డెమోసిస్టోను రాజకీయ వేదికగా 2016 లో స్థాపించారు. నగరానికి ‘స్వీయ-నిర్ణయం’పై తమ వైఖరిని పేర్కొంటూ దాని అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడకుండా పదేపదే నిరోధించారు. కాగా, కొత్తగా ఆమోదించిన జాతీయ భద్రతా చట్టం ప్రకారం, ప్రజాస్వామ్య అనుకూల వ్యక్తులు, వారి జీవితాలు, వ్యక్తిగత భద్రతపై ఆందోళన నెలకొందని వాంగ్‌ పేర్కొన్నారు.  రేపు ఏం జరగబోతుందో ఎవరూ ఊహించలేరని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను డెమోసిస్టో నుంచి వైదొలుగుతున్నా.. ఇక నా గొంతు వినిపించకపోవచ్చు. కానీ అంతర్జాతీయ సమాజం హాంకాంగ్‌ కోసం మాట్లాడడం కొనసాగిస్తుందని, మా స్వేచ్ఛను కాపాడేందుకు గట్టి ప్రయత్నం చేస్తుందని ఆశిస్తున్నా.’ అని వాంగ్‌ ట్వీట్‌ చేశాడు. 

ఇదిలా ఉండగా, హాంకాంగ్‌లోని ఇతర ప్రజాస్వామ్య అనుకూల సమూహాలు కూడా డెమోసిస్టోను అనుసరించాయి. స్వాతంత్ర్య అనుకూల బృందం హాంకాంగ్ నేషనల్ ఫ్రంట్ కూడా మంగళవారం నుంచి తన స్థానిక సభ్యులను రద్దు చేస్తానని సోషల్‌ మీడియాలో ప్రకటించింది. తైపీ, యూకేలోని తన విదేశీ విభాగాల ద్వారా హాంకాంగ్‌కు స్వేచ్ఛపై పోరాటం సాగిస్తామని పేర్కొంది. స్టూడెంట్‌ లోకలిజం అనే సంస్థ కూడా ఇలాంటి ప్రకటననే జారీ చేసింది. హాంకాంగ్‌కు స్వాతంత్ర్యం కోసం పోరాడేందుకు తైవాన్, యూఎస్, ఆస్ట్రేలియాలో విదేశీ విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.  logo