బుధవారం 28 అక్టోబర్ 2020
International - Oct 13, 2020 , 08:00:36

నిలిచిన జాన్సన్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌

నిలిచిన జాన్సన్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌

వాషింగ్టన్‌ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రాణాంతక వైరస్‌ నుంచి రక్షించే టీకా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. చాలా రకాల వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయి. ఇందులో యూఎస్ ఫార్మా స్యూటికల్ అండ్ మెడికల్ డివైస్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ ఒకటి. ఒక డోస్‌ టీకా ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చాయని, ఈ వ్యాక్సిన్‌ కొవిడ్‌ను ఎదుర్కొనే బలమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసినట్లు ఆ కంపెనీ ఇటీవల వెల్లడించడంతో ఆశలు రేకెత్తించాయి. ఈ క్రమంలో కంపెనీ సోమవారం మూడో దశ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు సోమవారం పేర్కొంది. మూడో విడత ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్‌ వివరించలేని అస్వస్థతకు కారణంగా ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

అస్వస్థతకు కారణం తెలియదని, దీంతో టీకా పరీక్షల మానవ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ చెప్పింది. టీకాను 60వేల మందిపై ప్రయోగించాలని కంపెనీ నిర్ధారించగా.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పేర్ల నమోదును నిలిపివేసింది. అలాగే రోగి ఆరోగ్యంపై భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది. పరిస్థితిని అభ్యర్థుల స్వతంత్ర డేటా, సేఫ్టీ మానిటరింగ్ బోర్డుతో పాటు కంపెనీ క్లినికల్, సేఫ్టీ ఫిజిషియన్లు సమీక్షిస్తున్నాయని కంపెనీ చెప్పింది. కాగా, సెప్టెంబర్‌లో ఆస్ట్రాజెనెకాకు చెందిన వ్యాక్సిన్‌ సైతం ట్రయల్స్‌ ఇదే తరహాలో నిలిచిన విషయం తెలిసిందే. ఎలాంటి ఇబ్బందులు లేవని తేలడంతో తర్వాత మళ్లీ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ మళ్లీ ప్రారంభమయ్యాయి.


logo