శుక్రవారం 23 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 12:27:01

జే అండ్ జే వ్యాక్సిన్‌.. 60వేల మందిపై 3వ ద‌శ ట్ర‌య‌ల్స్‌

జే అండ్ జే వ్యాక్సిన్‌.. 60వేల మందిపై 3వ ద‌శ ట్ర‌య‌ల్స్‌

 హైద‌రాబాద్‌: అమెరికాలో జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ సుమారు 60 వేల మందిపై క‌రోనా వ్యాక్సిన్ కోసం మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్‌ను ప్రారంభించింది.  సింగిల్ షాట్ కోవిడ్ టీకాను జే అండ్ జే కంపెనీ ప‌రీక్షిస్తున్న‌ది.  ఒక‌వేళ టీకా స‌క్సెస్ అయితే వ‌చ్చే ఏడాది బిలియ‌న్ల సంఖ్య‌లో డోస్‌ల‌ను మార్కెట్ చేయ‌నున్న‌ట్లు జే అండ్ జే పేర్కొన్న‌ది. అత్యంత శీత‌ల వాతావ‌ర‌ణంలో త‌మ వ్యాక్సిన్‌ను దాచిపెట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని డాక్ట‌ర్ బ‌రౌచ్ తెలిపారు. మిగితా వైర‌ల్ వ్యాక్సిన్ల‌తో పోలిస్తే ఇది త‌మ‌కు అడ్వాంటేజ్ అన్నారు. అయితే మూడ‌వ ద‌శ‌కు సంబంధించిన ఫ‌లితాలు ఈ ఏడాది చివ‌ర లేదా వ‌చ్చే ఏడాది ఆరంభంలో వెలుబ‌డే అవ‌కాశాలు ఉన్నాయి.  2021లో సుమారు వంద కోట్ల డోస్‌ల‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని జే అండ్ జే భావిస్తున్న‌ది.  

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ అభివృద్ధి జ‌రుగుతున్న‌ది.  అయితే 10 టీకాల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ ప్రారంభం అయ్యాయి. అమెరికాలో మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న నాలుగ‌వ కంపెనీగా జాన్స‌న్ అండ్ జాన్స‌న్ నిలిచింది. అమెరికా జాతీయ అంటువ్యాధుల సంస్థ డైర‌క్ట‌ర్ ఆంథోనీ ఫౌసీ కూడా జాన్స‌న్ టీకా ట్ర‌య‌ల్స్‌పై స్పందించారు. సార్స్ సీవోవీ2 వైర‌స్‌ను గుర్తించిన 8 నెల‌ల్లోనే అమెరికాలో నాలుగ‌వ వైర‌స్ టీకా ట్ర‌య‌ల్స్ మూడ‌వ ద‌శ‌కు చేరుకున్న‌ట్లు చెప్పారు. వ్యాక్సిన్ టెక్నాల‌జీలో ఇది అసాధార‌ణ ప్ర‌క్రియ అన్నారు.

ఆప‌రేష‌న్ వార్ప్ స్పీడ్‌లో భాగంగా జాన్స‌న్ కంపెనీకి 1.45 బిలియ‌న్ డాల‌ర్లు కేటాయించారు. జ‌లుబుకు కార‌ణ‌మైన అడినోవైర‌స్ ఆధారంగా సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను ఆ సంస్థ డెవ‌ల‌ప్ చేస్తోంది. క‌రోనా వైర‌స్‌లోని స్పైక్ ప్రోటీన్‌ల‌ను నియంత్రించే విధంగా వ్యాక్సిన్ త‌యారీ జ‌రుగుతున్న‌ది. ఎబోలా వ్యాక్సిన్‌కు వాడిన టెక్నాల‌జీతోనూ దీన్ని త‌యారు చేస్తున్నారు.   logo