జూలై 10: అమెరికాకు వెళ్లి చదువుకోవాలనుకొనే విద్యార్థులకు శుభవార్త. స్టూడెంట్ వీసాలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించాలనుకొన్న నిర్దిష్ట గడువు విధానాన్ని బైడెన్ సర్కారు ఉపసంహరించుకొన్నది. విదేశీ విద్యార్థులు తాము ఎన్ని రోజులు చదువుకొంటే అన్ని రోజులు అమెరికాలో ఉండటానికి వెసులుబాటు కల్పించింది. వారి వీసాలకు ఎలాంటి గడువు(ఎక్స్పైరీ) ఉండదని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2.02 లక్షల మంది భారతీయ విద్యార్థులకు మేలు జరుగుతుందని అంచనా. గతంలో ఇలాంటి విధానమే అమల్లో ఉండేది. అయితే ట్రంప్ సెప్టెంబర్‌లో స్టూడెంట్ వీసాలు నాలుగేండ్లు మాత్రమే చెల్లుబాటయ్యేలా నిర్ణయం తీసుకొన్నారు.