అమెరికాలో నగదు బదిలీ

- ఒక్కో పౌరుడికి 2 వేల డాలర్లు (దాదాపు రూ.1.45 లక్షలు)
- కరోనా నేపథ్యంలో బైడెన్ నిర్ణయం
వాషింగ్టన్, జనవరి 23: కరోనా సంక్షోభంతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు, దిక్కుతోచని స్థితిలో ఉన్న అమెరికన్లకు ఊరట కల్పించేందుకు కొత్త అధ్యక్షుడు జో బైడెన్ పలు కీలక కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేశారు. ‘అమెరికన్ రెస్క్యూ ప్లాన్'ను (అమెరికన్లను రక్షించే ప్రణాళిక) శుక్రవారం ఆవిష్కరించారు. కరోనా ఉపశమన ప్యాకేజీ కింద ఒక్కొక్కరికి రూ.2,000 డాలర్ల (దాదాపు రూ.1.45 లక్షలు) చొప్పున నేరుగా అందించనున్నట్టు చెప్పారు. ట్రంప్ హయాంలో ప్రతిపాదించిన 600 డాలర్లు సరిపోవని పేర్కొన్నారు. తాజా ప్రణాళికతో దేశ ఆర్థిక వ్యవస్థ ఒక ఏడాది ముందుగానే సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని బైడెన్ ఈ నెల 15న ప్రకటించారు.
దేశీయ తీవ్రవాదంపై సమీక్ష
క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో దేశీయ తీవ్రవాదంపై సమీక్ష నిర్వహించేందుకు బైడెన్ సర్కారు నిర్ణయించింది. దీనిపై సమగ్ర అంచనాకు వచ్చేందుకు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్ఐ), ఎఫ్‌బీఐ, హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సమీక్ష జరుపుతాయని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకి తెలిపారు.
ట్రంప్‌పై వచ్చే నెల 8న సెనేట్ విచారణ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానంపై వచ్చే నెల 8న సెనేట్‌లో విచారణ మొదలుకానున్నది. ప్రతినిధుల సభ ఇప్పటికే ఆయనను అభిశంసించింది. సోమవారం ఈ తీర్మానాన్ని సెనేట్‌కు పంపనున్నట్టు స్పీకర్ నాన్సీ పెలోసీ తెలిపారు. వచ్చే 8న సెనేట్‌లో విచారణ ప్రారంభం కానుంది.