బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 04, 2020 , 10:40:56

దూసుకువెళ్తున్న జోసెఫ్ బైడెన్‌

దూసుకువెళ్తున్న జోసెఫ్ బైడెన్‌

హైద‌రాబాద్‌:  డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున అమెరికా అధ్య‌క్ష పోటీలో నిలిచేందుకు జ‌రుగుతున్న ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో.. మాజీ ఉపాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ దూసుకువెళ్తున్నారు.  మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రచారంలో.. జోసెఫ్ బైడెన్ 8 రాష్ట్రాల్లో విజ‌యం సాధించారు.  సూప‌ర్ ట్యూజ్‌డే సంద‌ర్భంగా 14 రాష్ట్రాల్లో ఓటింగ్ జ‌రిగింది. ఈ ఎన్నిక‌ల్లో బెర్నీ శాండ‌ర్స్‌కు.. బైడెన్‌ గ‌ట్టి పోటీ ఇచ్చారు.  మ‌సాచుసెట్స్‌, మిన్న‌సోట‌, ఓక్ల‌హామా, ఆర్కాన్సా, అల‌బామా, టెన్నిసీ, నార్త్ క‌రోలినా, వ‌ర్జీనియా రాష్ట్రాల్లో బైడెన్ విజ‌యం సాధించారు. అయితే కీల‌క‌మైన కాలిఫోర్నియా రాష్ట్రంలో మాత్రం బెర్నీ శాండ‌ర్స్ గెలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.   ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  ప్ర‌స్తుత అధ్య‌క్షుడు, రిప‌బ్లిక‌న్ నేత డోనాల్డ్ ట్రంప్‌తో పోటీప‌డేందుకు బైడెన్‌, సాండ‌ర్స్‌లు ప్రైమ‌రీ రేసులో కుస్తీప‌డుతున్నారు.  

వ‌ర్జీనియా, నార్త్ క‌రోలినా లాంటి కీల‌క రాష్ట్రాల‌ను బైడెన్ గెల‌వ‌డంతో.. 2020 ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వ‌ర్జీనియాలో 53 శాతం ఓట్ల‌తో బైడెన్ గెలిచారు. అక్క‌డ రెండ‌వ స్థానంలో ఉన్న సాండ‌ర్స్‌కు కేవ‌లం 23 శాత‌మే ఓట్లు ద‌క్కాయి.  అంటే ఆఫ్రిక‌న్‌-అమెరిక‌న్ ఓట్ల‌ను బైడెన్ ఎక్కువ శాతం గెలుచుకున్న‌ట్లు తెలుస్తోంది.  ప్రైమ‌రీలో సేనేట‌ర్ ఎలిజ‌బెత్ వారెన్‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది.  మ‌స‌చుసెట్స్ రాష్ట్రంలో ఆమె బైడెన్ చేతిలో దారుణంగా ఓట‌మి పాల‌య్యారు. న్యూయార్క్ మాజీ మేయ‌ర్ మైఖేల్ బ్లూమ్‌బ‌ర్గ్ కూడా దారుణంగా ఓడిపోయారు.  బ్లూమ్‌బ‌ర్గ్ ఖ‌ర్చు చేసిన మిలియ‌న్ల డాల‌ర్లు నీటిలో వృధా అయిన‌ట్లు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా బైడెన్ లేదా సాండ‌ర్స్ ఎవ‌రు గెలిచినా.. ఆ అభ్య‌ర్థి ట్రంప్‌తో అధ్య‌క్ష రేసులో పోటీప‌డాల్సి ఉంటుంది. 


logo
>>>>>>