శనివారం 06 జూన్ 2020
International - May 18, 2020 , 17:35:28

అనుభవం లేని ట్రంప్ వల్ల అమెరికా నష్టపోయింది

అనుభవం లేని ట్రంప్ వల్ల అమెరికా నష్టపోయింది

వాషింగ్టన్: అమెరికా బోలెడు సంపద పోగేసుకుంది. సైనికశక్తిని అనూహ్య స్థాయికి పెంచుకుంది. కానీ ఇవేవీ అగ్రరాజ్యాన్ని కరోనా నుంచి కాపాడలేకపోయాయని నల్లజాతీయుల హక్కుల కార్యకర్త జెస్సీ జాక్సన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజకీయ, సైనిక అనుభవం లేని వ్యక్తి (ట్రంప్) అధ్యక్షుడు కావడం వల్ల దారుణమైన దుస్థితి దాపురించిందని చెప్పారు. గోల్ఫ్ ఆడడం, ర్యాలీల్లో పాల్గొనడానికి బదులు తగిన చర్యలు చేపడితే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని రెండు సార్లు అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన జాక్సన్ అన్నారు. వైరస్ వేసవి వాతావరణంలో గల్లంతై పోతుందని కబుర్లు చెపుతూ ఆరువారాల సమయాన్ని వృధా చేశారని దుయ్యబట్టారు. జార్జి బుష్, బరాక్ ఒబామాలు రూపొందించిన వైద్యపరీక్షల వ్యవస్థను ట్రంప్ పట్టించుకోలేదని, రాబోయే ముప్పుపై తగినంత శ్రద్ధ పెట్టలేదని జాక్సన్ ధ్వజమెత్తారు. సకాలంలో చర్యలు తీసుకోకుండా వేలాది మంది మరణానికి కారకుడయ్యారని అన్నారు. 'ముప్పు ముదిరేసరికి మనవద్ద వెంటిలేటర్లు, రెస్పిరేటర్ల వంటి సాధన సంపత్తి తగినంతగా లేకపోయింది. ఆర్థిక, సైనిక పోరాటాలకే మనం సన్నద్ధంగా ఉన్నాం. కానీ ఈ వైరస్ పై పోరాటంలో అవేవీ పనికిరావు. ఈ పోరాటం పూర్తిగా వేరే' అని జాక్సన్ అన్నారు. ట్రంప్ మీడియా సమావేశాలను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. సుదీర్ఘమైన ప్రెస్‌మీట్లలో  స్వోత్కర్ష, డంబాలు, విలేకరులపై ఎగరడం, అశాస్త్రీయతను భుజాన వేసుకోవడం వంటివి చేశారని జాక్సన్ అన్నారు. పారిశుధ్య ద్రవాలను ఇంజెక్షన్ చేసుకోవాలని చెప్పడాన్ని జాక్సన్ ఈ సందర్భంగా గుర్తు చేసారు. కరోనా సంక్షోభంలో పేదలను పట్టించుకోవడం లేదని, సంపన్నులు తమ కోటల్లాంటి నివాసాల్లో క్షేమంగా ఉన్నామని అనుకుంటే పొరబాటేనని చెప్పారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు, యువరాజు చార్లెస్‌కు, ఇంకా ఎందరెదరో ప్రముఖులకు కరోనా సోకడాన్ని గుర్తు చేశారు. జైళ్లల్లో ఉన్న 22 లక్షల ఖైదీలకు పరీక్షలు జరపాలని కోరుతూ ఆయన ఇదివరకే రెండుసార్లు అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖలు రాశారు. ఖైదీలకు వైరస్ ఉంటే జైళ్ల సిబ్బంది ద్వారా బయటకు వైరస్ పాకుతుందని జాక్సన్ హెచ్చరించారు.


logo