లండన్: దేశంలో అత్యాచార కేసులు పెరగడానికి ఆడవాళ్లు ధరిస్తున్న దుస్తులే కారణమని ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ కూడా ఆ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆడవాళ్లు కాదు.. పురుషులే తమ చూపును అదుపులో పెట్టుకోవాలన్న ఖురాన్లో ఓ వ్యాఖ్యాన్ని జమీమా వినిపించారు. తన ట్విట్టర్లో ఖురాన్ వ్యాఖ్యాన్ని ఆమె పోస్టు చేశారు. తప్పంతా మగవారిదే అన్న అభిప్రాయాన్ని ఆమె వినిపించింది. బహుశా ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా తర్జుమా చేశారేమో అన్న అభిప్రాయాన్ని జెమీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే నాకు తెలిసిన ఇమ్రాన్ .. మగవారిని హద్దుల్లో ఉండాలని సూచించేవాడని, ఆడవాళ్లను కాదు అని ఆమె అన్నారు. మహిళలు అసభ్యకర దుస్తులు వేసుకోవడం వల్లే రేప్, లైంగిక దాడి కేసులు పెరుగుతున్న ప్రధాని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇస్లాం మతాచారం ప్రకారం పరదా వేసుకోవడం అంటే.. మనలో ఉన్న ఉద్వేగాలను అదుపులో పెట్టుకోవడమే అని, కానీ సమాజంలో చాలా మంది తమ శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నారని ఇమ్రాన్ అన్నారు.