న్యూయార్క్: అమెజాన్ సంస్థ సీఈవో.. బిలియనీర్ జెఫ్ బేజోస్ తన చిన్ననాటి కలను నిజం చేసుకోనున్నాడు. జూలై 20వ తేదీన ఆయన అంతరిక్షంలో విహరించనున్నారు. తన సోదరుడితో కలిసి ఆకాశంలో ఎగరనున్నట్లు జెఫ్ బేజోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. బేజోస్‌కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఆర్జిన్ తయారు చేసిన రాకెట్లో అన్నాదమ్ముళ్లు గగన విహారం చేయనున్నారు. అంతరిక్షం నుంచి భూమిని చూస్తే, ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుందని, భూమితో ఉన్న బంధాల్ని మార్చేస్తుందని, నింగికెగరడం ఓ సాహసం అవుతుందని ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియోలో బేజోస్ తెలిపారు. న్యూ షెపర్డ్ రాకెట్లో బేజోస్ సోదరులు రోదసిలోకి వెళ్లనున్నారు. ఆరుగురు ప్రయాణికులను మోసుకువెళ్లే రీతిలో రాకెట్‌ను నిర్మించారు. సముద్ర మట్టం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కర్మన్ లైన్ వరకు రాకెట్ వెళ్తుంది. అక్కడ క్యాప్సూల్ నుంచి బూస్టర్ వేరవుతుంది. ఆ సమయంలో దాంట్లో ఉన్న ప్రయాణికులు భూమిని సంపూర్ణంగా చూసే వీలుంటుంది. గురుత్వాకర్షణ శక్తి లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కూడా వస్తుంది. ఆ తర్వాత బూస్టర్, క్యాప్సూల్లు రెండు వేర్వేరుగా ల్యాండ్ అవుతాయి. ప్యారాచూట్ల సాయంతో వెస్ట్ టెక్సాస్ ఎడారిలో క్యాప్సూల్ ల్యాండ్ అవుతుంది.