గురువారం 26 నవంబర్ 2020
International - Nov 14, 2020 , 02:43:10

‘న్యూట్రినో’ ఆవిష్కర్త కన్నుమూత

‘న్యూట్రినో’ ఆవిష్కర్త కన్నుమూత

టోక్యో: జపాన్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ గ్రహీత మసతోషి కోషిబా (94) కన్నుమూశారు. యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యోలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన టోక్యో దవాఖానలో గురువారం మృతిచెందారు. ఈ మేరకు యూనివర్సిటీ వర్గాలు శుక్రవారం వివరాలు వెల్లడించాయి. అయితే, ఆయన మరణానికి గల కారణాల్ని తెలుపలేదు. ‘న్యూట్రినోస్‌' అనే అత్యంత సూక్ష్మ కణాలను కనుగొని, వాటిపై చేసిన పరిశోధనలకు గాను కోషిబాకు 2002లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. ఆ సంవత్సరం మరో ఇద్దరు శాస్త్రవేత్తలు రేమండ్‌ డేవిస్‌ జూనియర్‌, రికార్డో గికోనికి కూడా ఇదే విభాగంలో ఈ పురస్కారం వచ్చింది. సూర్యుడి కేంద్రకంలో జరిగే చర్యల ఫలితంగా న్యూట్రినోస్‌ విడుదలవుతాయని కోషిబా కనుగొన్నారు. సూపర్‌ నోవాల నుంచి వెలువడే బ్రహ్మాండమైన కాంతిపై అధ్యయనానికి ఈ పరిశోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి.