ఆదివారం 24 జనవరి 2021
International - Dec 15, 2020 , 15:34:00

9 మందిని చంపిన ట్విట్ట‌ర్ కిల్ల‌ర్‌కు మ‌ర‌ణ‌శిక్ష‌

9 మందిని చంపిన ట్విట్ట‌ర్ కిల్ల‌ర్‌కు మ‌ర‌ణ‌శిక్ష‌

హైద‌రాబాద్‌:  ట్విట్ట‌ర్ సోష‌ల్ నెట్వ‌ర్క్ ద్వారా ప‌రిచ‌య‌మైన ఎనిమిది మంది అమ్మాయిల‌ను హ‌త్య చేసిన వ్య‌క్తికి జ‌పాన్‌లో మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేశారు.  30 ఏళ్ల ట‌కాహిరో షిరాహిషి అనే వ్య‌క్తిని 2017లో అరెస్టు చేశారు.  జ‌పాన్‌లో ట్విట్ట‌ర్ కిల్ల‌ర్‌గా అత‌ను పేరుగాంచాడు. హ‌త్య చేసిన వ్య‌క్తుల శ‌రీర భాగాలు అత‌ని ఫ్లాట్‌లో పోలీసులు గుర్తించారు.  సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో ప‌రిచ‌య‌మైన అమ్మాయిల‌ను ఇంటికి ర‌ప్పించి హ‌త్య చేశాడు.  సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా మారిన ట‌కాహిరో గురించి దేశ‌వ్యాప్తంగా చ‌ర్చించారు. ఆత్మ‌హ‌త్య‌లు ఎలా చేసుకోవాల‌న్న అంశంపై చ‌ర్చించేందుకు మ‌హిళ‌ల్ని ట్విట్ట‌ర్ ద్వారా వ‌ల వేశాడ‌త‌ను. అయితే త‌న ఇంటికి వ‌చ్చిన 15 నుంచి 26 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న 8 మంది అమ్మాయిల‌ను, ఒక పురుషున్ని అత‌ను ఉరి వేసి హ‌త్య చేశాడు. సీరియ‌ల్ కిల్ల‌ర్    

2017లో హాలోవీన్ రోజున పోలీసులు ట‌కాహిరో ఫ్లాట్‌లో బాధితుల శ‌రీర భాగాల‌ను గుర్తించారు.  టోక్యోకు స‌మీపంలో ఉన్న జామా సిటీలో హంత‌కుడి ఫ్లాట్ ఉన్న‌ది.  ఆ ఇంట్లో ఉన్న కూల‌ర్లు, టూల్ బాక్సుల్లో చేతులు, కాళ్ల‌ను దాచాడు. 9 మంది త‌ల‌ల‌ను కూడా పోలీసులు గుర్తించారు.  దీంతో జ‌పాన్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. అయితే ట్విట్ట‌ర్ ద్వారా పరిచ‌య‌మైన వారిని తానే చంపిన‌ట్లు షిరాహిషి అంగీక‌రించాడు.  చంపేందుకు బాధితుల ప‌ర్మిష‌న్ ఉంది కాబ‌ట్టి.. త‌న క్ల‌యింట్‌కు త‌క్కువ శిక్ష‌ను వేయాల‌ని ట‌కాహిరో త‌ర‌పున న్యాయ‌వాదులు కోరారు. కానీ బాధితుల అనుమ‌తి లేకుండానే వారిని చంపిన‌ట్లు హంత‌కుడు టోక్యో కోర్టు ముందు ఒప్పుకున్నాడు.    


logo