టోక్యో: జపాన్ యువరాణి మాకో తన వారసత్వ సంపదను వదులుకోనున్నది. చక్రవర్తి అఖిహిటో ముని మనవరాలు .. 29 ఏళ్ల మాకో తన బాయ్‌ఫ్రెండ్ కీయ్ కౌమురోను పెళ్లి చేసుకోనున్నది. నిజానికి ఈ ఇద్దరి మధ్య 2017లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కౌమురో తల్లి, ఆమె మాజీ ప్రియుడి మధ్య ఉన్న ఆర్థిక వివాదం వల్ల మ్యారేజ్ ఆలస్యమవుతోంది. యువరాణితో పాటు చదువుకున్న కౌమురో ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. జపాన్ రాజ కుటుంబంలో ఎవరైనా అమ్మాయిలు సాధారణ వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటే వాళ్లకు రావాల్సిన ఆడ ఇంటి భరణం ఇవ్వరు. రాజకుటుంబంలో ఉన్న మహిళలకు సాధారణంగా 13 లక్షల డాలర్లు ఇస్తారు. అయితే మాకో సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని ఆమె వదులుకోనున్నది. దీనికి ఆమె అంగీకారం కూడా చెప్పినట్లు జపాన్ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో ఆ ఇద్దరి వివాహం జరిగే ఛాన్సు ఉంది. జపాన్ రాచరిక వారసత్వ చట్టం ప్రకారం.. రాయల్ ఫ్యామిలీలో మహిళలు ఎవరైనా సాధారణ వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటే, వాళ్లకు రాచరిక హోదా పోతుంది.