శనివారం 29 ఫిబ్రవరి 2020
చెప్పుకోలేని కష్టాలు

చెప్పుకోలేని కష్టాలు

Feb 13, 2020 , 03:11:29
PRINT
చెప్పుకోలేని కష్టాలు
  • అధిక పనివేళలతోఅలసిపోతున్న చైనా వైద్యులు
  • కఠిన ఆంక్షల నేపథ్యంలో నోరువిప్పని పరిస్థితులు
  • వేలమంది డాక్టర్లు, సిబ్బందికి ‘కరోనా’ లక్షణాలు
  • జపాన్‌ నౌకలోని ఇద్దరు భారతీయలకు వైరస్‌

బీజింగ్‌: చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ (కొవిడ్‌-19), ప్రభుత్వ కఠినమైన ఆంక్షల వల్ల ఆ దేశ వైద్యులు చెప్పుకోలేని కష్టాలు అనుభవిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిచెందిన హుబేయి రాష్ట్రం వుహాన్‌ నగరంలోని దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ల గోడు వర్ణనాతీతం. ప్రతిరోజు కొత్తగా వేల కేసుల నమోదుతో నిరంతరం పరీక్షలు, చికిత్సలు చేస్తుండటంతో అధిక పనివేళలతో విశ్రాంతి లేక వైద్యులు, సిబ్బంది అలసిపోతున్నారు. మాస్కులు, రక్షిత సూట్లు, వైద్య పరికరాల కొరతతో అవస్థలు పడుతున్నారు. చికిత్స అం దిస్తున్న వారిలో వేల మంది డాక్టర్లు, సిబ్బందిలో కరోనా లక్షణాలు కనిపించడంపట్ల ఆందోళన చెందుతున్నారు. ఆంక్షల వల్ల తమ గోడును ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. కరోనా వైరస్‌ గురించి తొలిసారి బయటపెట్టిన డాక్టర్‌ లీ వెన్లియాంగ్‌ దాని బారినపడి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. వైద్యులంతా కరోనాపైనే దృష్టిపెట్టడంతో మిగతా రోగుల గోడు ఎవరికీ పట్టడం లేదు. కరోనా బారినపడిన వారిలో 97 మంది మంగళవారం చనిపోయారు. దీంతో మృ తుల సంఖ్య 1113కు చేరింది.  మరోవైపు కమ్యూనిస్ట్‌ రాజ్యం చైనాలో వాక్‌ స్వాతం త్య్రం కోసం పిలుపునిస్తున్నవారి సంఖ్య ఇటీవల పెరుగుతున్నది. 


జపాన్‌ నౌకలో 174కు చేరిన కేసులు

జపాన్‌ నౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌'లోని 3711 మంది(ప్రయణికులు, సిబ్బంది)లో తాజాగా 39 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఇద్దరు భారతీయ సిబ్బంది ఉన్నట్లు జపాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. ప్రయాణికులు, సిబ్బందిసహా మొత్తం 138 మంది భారతీయులు నౌకలో ఉన్నారు. ఫిబ్రవరి 5 నుంచి పోర్టువద్ద నిలిపిన ఈ నౌకలో కరోనా బారినపడిన వారి సంఖ్య 174కు చేరింది. ఆ దేశ ఆరోగ్య నిబంధనల మేరకు అందరినీ ఈనెల 19 వరకు నౌకలోనే ఉంచనున్నట్లు జపాన్‌ అధికారులు తెలిపారు.  


కరోనా ముప్పుపై రాహుల్‌ ఆందోళన

కరోనా ముప్పుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే దీని గురించి కేంద్రం పెద్దగా పట్టించుకోవడంలేదని, వైరస్‌ నివారణ చర్యలు చేపట్టడంలేదని ట్విట్టర్‌లో ఆరోపించారు. చైనా నుంచి వచ్చిన ముగ్గురు కేరళ వాసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైన సంగతి తెలిసిందే. 


logo