బుధవారం 03 జూన్ 2020
International - May 14, 2020 , 12:27:27

ఆ నగరంలో మేకలు కదం తొక్కాయి

ఆ నగరంలో మేకలు కదం తొక్కాయి

సాన్‌జోస్: కరోనా లాక్‌డౌన్ తో ప్రకృతి తన ఆరోగ్యాన్ని తాను మెరుగుగా తీర్చి దిద్దుకుంటున్నదనే వ్యాఖ్యలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నదీనదాలు, తటాకాలు, సముద్రాల్లో కాలుష్యం తగ్గిందనే వార్తలు విన్నప్పుడు,  జనావాసాల్లో జంతులోకం సందడి చేసినప్పుడు. ఇప్పుడు ఒకడుగు ముందుకు వేసి జంతులోకం తిరుగుబాటు చేస్తున్నదని కూడా చెప్పుకోవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ తరహా సంఘటనే జరిగింది. సాన్‌జోస్ నగరంలోకి సుమారు 200 మేకలు ప్రవేశించాయి. పదండి ముందుకు అంటూ కదం తొక్కాయి. నగరంలో కవాతు చేశాయి. ఇళ్ల చుట్టూ కంచెల్ని ఛేదించుకుని మొక్కల్ని మేశాయి. దారిపొడుగునా గడ్డిపరకలను అంటుకు లేకుండా నమిలేస్తూ ముందుకు సాగాయి. భౌతిక దూరం అనే నిబంధనను 'మే మే' అంటూ బేఖాతరు చేశాయి. కొన్నాళ్లుగా సమీపంలోని గుట్టమీదకు మేతకు వెళ్లే ఆ మేకలు జనసంచారం లేని కారణంగా ఏమో జనావాసాల మీదకు వచ్చిపడ్డాయి. మేకల బీభత్సాన్ని జాక్ రోలాండ్స్ అనే వ్యక్తి వీడియోకు ఎక్కించారు. అవి ల్యాండ్‌స్కేపింగ్ మొక్కల్ని పీకిపాకాన పెట్టడం చూసి మొదట్లో మండిపడ్డ ఇళ్ల యజమానులు తర్వాత సరదాగా నవ్వేసుకున్నారని రోలాండ్స్ చెప్పారు. కొద్దిసేపటిలోనే మేకలను అదుపు చేసి అక్కడి నుంచి దూరంగా తరలించారు. ఆ తర్వాత ఇళ్ల యజమానులు వాటి పెంటికలను ఏరేసేందుకు గంటకు పైగా పట్టిందట.


logo