గురువారం 28 మే 2020
International - Apr 23, 2020 , 12:55:42

ఇది అమెరికాపై జరిగిన దాడి.. ట్రంప్ కొత్తపాట

ఇది అమెరికాపై జరిగిన దాడి.. ట్రంప్ కొత్తపాట

హైదరాబాద్: కరోనా కల్లోలంతో సతమతం అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. ఇదివరకు కరోనాను కేవలం ఫ్లూజ్వరం అని కొట్టిపారేసిన ట్రంప్ ఇప్పుడు అమెరికా మీద దాడి జరిగిందని కొత్తపాట ఎత్తుకున్నారు. అమెరికాలో కరోనా కేసులు ఎనిమిదన్నర లక్షలు దాటాయి. మరణాలు 50 వేలకు చేరువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 'మన మీద దాడి జరిగింది.. ఇది దాడి.. ఇది కేవలం ఫ్లూజ్వరం కాదు.. చివరిసారిగా ప్రపంచం 1917లో ఇలాంటిది చూసింది' అని ఆయన పేర్కొన్నారు. కరోనాతో నష్టపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న లక్షల కోట్ల వ్యయంతో అమెరికా జాతీయ రుణభారం పెరిగిపోతున్నది. దీని గురించి ప్రశ్నించినప్పుడు, 'మనకు వేరే మార్గం లేదు. ఉందంటారా? మనం ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది. మనది ప్రపంచ చరిత్రలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థ. చైన కన్నా, మరే ఇతర దేశం కన్నా గొప్పది' అని ట్రంప్ సమాధానమిచ్చారు. గత మూడేళ్లుగా నిర్మించినది అంతా ఒక్కదెబ్బకు కుప్పకూలింది.. మనం మళ్లీ పట్టాలెక్కాలంటే కొంత డబ్బు ఖర్చు చేయకతప్పదని చెప్పారు.


logo