ఆదివారం 24 మే 2020
International - Mar 18, 2020 , 20:07:34

కవితకు అవకాశమివ్వడం సంతోషదాయకం..

కవితకు అవకాశమివ్వడం సంతోషదాయకం..

దోహా: ఉద్యమ నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ టికెట్‌ కేటాయించడం పట్ల టీఆర్‌ఎస్‌ ఖతార్‌ అధ్యక్షులు శ్రీధర్‌ అబ్బగౌని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదావకాశాన్ని సరైన వ్యక్తికి కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కవితను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో రాష్ట్రప్రజలతో పాటు ప్రవాస తెలంగాణవాసులు కూడా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కవిత ఉక్కుమహిళగా తన పాత్ర నిర్వహించిందని శ్రీధర్‌ తెలిపారు. రాష్ట్ర సాధన అనంతరం, నిజామాబాద్‌ నుంచి ఎంపీగా ఎన్నికై.. ఉత్తమ పార్లమెంటీరియన్‌ అవార్డును సైతం పొందారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీగా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని ఈ సందర్భంగా శ్రీధర్‌ తెలిపారు. 

ప్రవాస తెలంగాణవాసుల సంక్షేమానికి ఆమె నిత్యం తన వంతు సహకారం అందించారని ఆయన తెలిపారు. రాజకీయంగానే కాకుంగా, సామాజిక సేవలోనూ ఆమె నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి, బతుకమ్మ, బోనాల పండుగల ద్వారా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేశారని ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఖతార్‌ శాఖ అధ్యక్షులు శ్రీధర్‌ తెలియజేశారు. 

స్థానిక సంస్థల ప్రజాప్రతినిథులంతా కారు గుర్తుకు ఓటేసి, కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కవితతోనే నిజామాబాద్‌ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.


logo