శనివారం 30 మే 2020
International - Mar 30, 2020 , 00:54:39

33వేలు దాటిన మరణాలు

33వేలు దాటిన మరణాలు

-యూరప్‌, అమెరికాలో కోరలు చాస్తున్న కరోనా

-స్పెయిన్‌, ఇటలీ దేశాల్లో ఒకేరోజు 800మందిపైగా మృత్యువాత

న్యూయార్క్‌, మార్చి 29: కరోనా కోరల్లో చిక్కి యూరప్‌, అమెరికా విలవిల్లాడుతున్నాయి. ఇటలీ, స్పెయిన్‌లలో ఒకే రోజు 800 మందికిపైగా చొప్పున మృత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 33,000 దాటింది. 7 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు మూడింట ఒక వంతు జనా భా దిగ్బంధంలో ఉన్నది. అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్ర స్థానంగా ఉన్న న్యూయార్క్‌ నగరాన్ని దిగ్బంధించాలని ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ట్రంప్‌ నిర్ణయాన్ని న్యూయార్క్‌ గవర్నర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ‘సమాఖ్య యుద్ధానికి’ దారితీస్తుందని, ఫలితంగా కల్లోల పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 2,300 దాటింది. ప్రపంచంలోనే అత్యధికంగా 1,33,000 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య మూడు రోజుల్లోనే రెట్టింపైంది. మొత్తం మరణాల్లో పావు భాగం న్యూయార్క్‌ నగరంలోనే సంభవించాయి. ఇటలీ పరిస్థితులే న్యూయార్క్‌లోనూ ఎదురుకావొచ్చని అక్కడి వైద్య నిపుణులు భయాందోళనలు వ్యక్తంచేశారు. పెరుగుతున్న కేసులతో వైద్య సిబ్బంది సతమతమవుతున్నారు. వెంటిలేటర్లతోపాటు ఇతర వైద్య సామగ్రికి కొరత ఏర్పడింది. మరోవైపు, అమెరికాలో కరోనాతో ఏడాదిలోపు చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఏడాదిలోపు శిశువు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. పనామాలో క్రూయిజ్‌ నౌకలో చిక్కుకుపోయిన ప్రయాణికులను మరో నౌకలోకి తరలించారు. నౌకలో 1800 మంది ప్రయాణికులు ఉండగా, కరోనా కారణంగా శుక్రవారం నలుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి వైరస్‌ సోకింది. 

యూరప్‌లో 20,000లకుపైగా..

యూరప్‌లో కరోనా మృతుల సంఖ్య 20,000 దాటింది. ఇందులో సగం మరణాలు ఇటలీలోనే (10,779) చోటుచేసుకున్నాయి. ఇటలీ తర్వాత అత్యధికంగా ప్రభావితమైన స్పెయిన్‌లో  ఆదివారం ఒక్కరోజే 838 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 6,606కి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను స్పెయిన్‌ మరింత కఠినతరం చేసింది. అత్యవసరం కాని వాణిజ్య కార్యకలాపాలను రెండు వారాలపాటు నిలిపివేయాలని ఆదేశించింది. ఫ్రాన్స్‌లో 2,600 మందికిపైగా మరణించారు.యుద్ధం ఇప్పుడే మొదలైందని, వచ్చే రెండు వారాలు మరింత కఠినంగా ఉండనున్నాయని ఆ దేశ ప్రధాని ఎడ్వర్డ్‌ ఫిలిప్పే వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో మృతుల సంఖ్య 1200 దాటింది. మరోవైపు బెల్జియంలో మృతుల సంఖ్య పెరుగుతున్నది. శనివారం 353 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందురోజు 289 మంది మృతిచెందారు. ఇరాన్‌లో మృతుల సంఖ్య 2640కి చేరుకున్నది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఒక సూపర్‌మార్కెట్‌ ఎదుట ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూసేందుకు పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది.  


logo