ఆదివారం 29 మార్చి 2020
International - Mar 25, 2020 , 00:33:41

ఇటలీలో ఎందుకీ మృత్యుకేళి?

ఇటలీలో ఎందుకీ మృత్యుకేళి?

-కరోనాతో అతలాకుతలం

-ఆదిలో అలక్ష్యం.. ఆంక్షల అమల్లో నిర్లక్ష్యం

-వృద్ధుల జనాభా అధికంగా ఉండటం మరో కారణం

రోమ్‌: కరోనా మహమ్మారితో ఇటలీ విలవిల్లాడుతున్నది. ప్రపంచంలో అత్యధిక మరణాలు ఈ దేశంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 6,820 మంది మృత్యువాతపడ్డారు. 69,178 మంది వైరస్‌ బారినపడ్డారు. ప్రస్తుతం దేశం యావత్తూ దిగ్బంధంలో ఉన్నది. అయితే ఇటలీలో ఈ మృత్యుఘోష ఎందుకు సాగుతున్నది. ఆ దేశం ఎక్కడ కట్టుతప్పింది?

ముప్పును తక్కువచేసి చూపారు..

కరోనా తీవ్రతను అంచనా వేయడంలో ఇటలీ విఫలమైంది. కరోనా ముప్పును తక్కువ చేసి చూపడం వైరస్‌ వ్యాప్తికి కారణమైంది. వైరస్‌ ఉన్నా సాధారణ ఫ్లూ, జ్వరం లక్షణాలుగా పరిగణిస్తూ వైరస్‌ వ్యాప్తిని నిర్లక్ష్యం చేయడంతో అది చాపకింద నీరులా వ్యాప్తి చెందింది. ప్రభావిత ప్రాంతాలను త్వరితగతిన ఐసొలేట్‌ చేయడం, ప్రజల రాకపోకలను నియంత్రించడం, ఆంక్షలను కఠినంగా అమలుచేయడంలో ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శించింది.  

23శాతం వృద్ధులే..

ప్రపంచంలోనే వృద్ధుల జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇటలీ రెండో స్థానంలో ఉన్నది. ఆ దేశ జనాభాలో దాదాపు 23% మంది 65 ఏండ్లు పైబడినవారే. వైరస్‌ ఉధృతికి ఇది కూడా ఒక కారణం. వృద్ధులకు కరోనా వైరస్‌ అత్యంత ప్రమాదకరం. ఇటలీలో యువతకు వృద్ధులతో అనుబంధం ఎక్కువ. వారి ద్వారా వైరస్‌ వృద్ధులకు వ్యాపించడంతో ప్రాణనష్టం పెరిగింది.


logo