మంగళవారం 31 మార్చి 2020
International - Mar 20, 2020 , 01:51:14

విశ్వ పోరాటం

విశ్వ పోరాటం

  • పలుదేశాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు
  • ఇటలీలో చైనాను దాటిన మరణాలు.. 3,405 మంది మృతి

మాడ్రిడ్‌ /టెహ్రాన్‌/రోమ్‌, మార్చి 19: అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు ఇటలీలో కరోనా మృతుల సంఖ్య చైనాను దాటింది. చైనాలో ఇప్పటివరకు 3,245 మరణాలు నమోదుకాగా.. ఇటలీలో గురువారం నాటికి 3,405 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటికే విధించిన దేశవ్యాప్త షట్‌డౌన్‌ను వచ్చేనెల 3 వరకు పొడిగించారు. చైనాలో గురువారం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఫ్రాన్స్‌ కూడా తమ దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించాలని భావిస్తున్నది. అస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ తమ సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించాయి. బ్రిటన్‌లో శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయనున్నారు. అత్యవసరమైతే రంగంలోకి దిగడానికి సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. తమ సరిహద్దులను మూసివేస్తున్నట్లు అమెరికా, కెనడా ప్రకటించాయి. అయితే అత్యవసర ప్రయాణాల కోసం 30 రోజులవరకు అనుమతించనున్నట్లు తెలిపాయి. 

9,400 మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 9,400కు, బాధితుల సంఖ్య 2.30 లక్షలకు పెరిగింది. ఇరాన్‌లో వైరస్‌ సోకిన ఓ భారతీయుడు మృతిచెందాడు. ఇరాన్‌లో గురువారం ఒక్కరోజే 149 మంది మృతిచెందగా, మరణాలసంఖ్య 1,284కు చేరింది. స్పెయిన్‌లో కొవిడ్‌తో గురువారం 165 మంది చనిపోయారు. జర్మనీలో ఒక్కరోజే 2,800కుపైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మరణాల సంఖ్య 149కి చేరింది. వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా 100 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ ఫైల్‌పై ట్రంప్‌ సంతకం చేశారు. రష్యాలో తొలి మరణం సంభవించగా.. ఫిజిలో తొలి కేసు నమోదైంది. పాక్‌లో బాధితులసంఖ్య 381కి పెరిగింది. ఆఫ్రికా దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్‌ పిలుపునిచ్చారు. logo
>>>>>>