మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 15:49:44

కోడి కూసింద‌ని య‌జ‌మానికి రూ. 15 వేలు జ‌రిమానా!

కోడి కూసింద‌ని య‌జ‌మానికి రూ. 15 వేలు జ‌రిమానా!

అదేంటి కోడి ఉద‌యాన్నే కూయ‌క ఇంకెప్పుడు కూస్తుంది అని అనుకుంటున్నారా? అలా కూసి ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది క‌లిగించింద‌ని ఆ య‌జ‌మానికి రూ. 15 వేలు జ‌రిమానా విధించారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. లంబార్డీ‌లోని కాస్టిరగా విదార్దో పట్టణంలో నివశిస్తున్న ఎంగేలో బొలెట్టీ అనే 80 ఏండ్ల వృద్ధుడు కార్లినో అనే కోడి పుంజును పెంచుకుంటున్నాడు. ఆ పుంజు ప్ర‌తిరోజూ ఉద‌యం 4.30 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు నాన్‌స్టాప్‌గా కూస్తూనే ఉంటుంది. దీంతో ఇరుగుపొరుగువారి నిద్ర‌కు భంగం క‌లుగుతుండ‌డంతో య‌జ‌మాని మీదకు గొడ‌వ‌కు వ‌చ్చారు. కానీ ఆయ‌న మాత్రం ఏం చేస్తాడు. దాన్ని ఎక్క‌డ బంధించినా కూయ‌కుండా మాత్రం ఆప‌లేడు క‌దా. ప్ర‌తిరోజూ ఇలానే జ‌రుగుతుండ‌డంతో ఆయ‌న మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇరుగుపొరుగు వాళ్లు.

దీంతో పోలీసులు బెలెట్టీ ఇంటిపై నిఘా ఉంచారు. వారు చెప్పిన స‌మ‌యంలోనే కోడి కూస్తుంద‌ని అత‌డికి 200 డాల‌ర్లు సుమారు రూ. 15 వేలు జ‌రిమానా విధించారు. దానికి అత‌ను 'ప‌దేండ్లుగా పెంచుకుంటున్న పుంజును ఇరుగుపొరుగు వారి గోల భ‌రించ‌లేక మా స్నేహితుడికి అమ్మేశాను. అత‌ను వేరే ఊరెళ్తూ నా వ‌ద్ద వ‌దిలేసి వెళ్లాడు. 20 రోజుల నుంచి నా వ‌ద్దే ఉంద'ని పోలీసుల ద‌గ్గ‌ర వాపోయాడు. అయితే ఇట‌లీలో పెంపుడు జంతువులు పెంచుకునేవారికి ఒక నిబంధ‌న ఉంది. ప‌క్కంటివారికి 10 మీట‌ర్ల దూరంలో పెంపుడు జంతువుల‌ను ఉంచాలి. అయితే ఆ రూల్ నాకు తెలియ‌దు క్ష‌మించండి అంటున్నాడు బెలెట్టీ. ఈ జరిమానాపై ప్రస్తుతం ఆయన అధికారులతో పోరాడుతున్నాడు.


logo