శనివారం 23 జనవరి 2021
International - Dec 21, 2020 , 14:53:04

వ్యాక్సిన్‌ను జ‌యించాలంటే క‌రోనాకు ఏళ్లు ప‌డుతుంది: సైంటిస్టులు

వ్యాక్సిన్‌ను జ‌యించాలంటే క‌రోనాకు ఏళ్లు ప‌డుతుంది: సైంటిస్టులు

న్యూయార్క్‌: బ‌్రిట‌న్‌లో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ వ‌చ్చింద‌న్న వార్త‌ల‌పై ప్ర‌పంచ‌మంతా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. క్ర‌మంగా ఒక్కో వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తున్నా.. ఈ కొత్త ర‌కం వైర‌స్‌ను అవి స‌మ‌ర్థంగా ఎదుర్కోగ‌ల‌వా అన్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఈ విష‌యంలో సైంటిస్టులు మాత్రం కాస్త ఊర‌ట క‌లిగించే వార్తే చెబుతున్నారు. ప్ర‌స్తుతం వ‌స్తున్న వ్యాక్సిన్‌ల‌ను జ‌యించాలంటే క‌రోనా వైర‌స్‌కు కొన్నేళ్లు ప‌డుతుంద‌ని వాళ్లు అంటున్నారు. ఒక్క మ్యుటేష‌న్ వ‌ల్ల వ్యాక్సిన్‌లు ప‌ని చేయ‌కుండా పోయే ప్ర‌మాదం ఏదీ లేద‌ని భ‌రోసా ఇస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక వెల్ల‌డించింది. ఈ కొత్త వేరియంట్లు ఆందోళ‌న క‌లిగిస్తున్నా.. ఇవేవీ త‌మ‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేద‌ని సైంటిస్టులు చెప్పిన‌ట్లు ఆ ప‌త్రిక తెలిపింది. 

వ్యాక్సినేష‌న్లు, మ‌నుషుల్లో పెరిగిపోతున్న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ వ‌ల్ల వైర‌స్ మ‌నుగ‌డ సాగించ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని, అయితే అందుకు త‌గిన‌ట్లు వైర‌స్ మ్యుటేష‌న్లు జరిగి మ‌రింత సులువుగా వ్యాప్తి చెందవ‌చ్చ‌ని కూడా సైంటిస్టులు అంచ‌నా వేస్తున్న‌ట్లు న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక చెప్పింది. మ్యుటేష‌న్లు క్ర‌మంగా పెరుగుతూనే ఉంటాయ‌ని, వీటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ ప్ర‌భావం చూపించే వేరియంట్స్ ఏవో గుర్తించాల‌ని ప్ర‌ముఖ బ‌యాల‌జిస్ట్ జెస్సీ బ్లూమ్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఈ వ్యాక్సిన్‌లు ఏవీ ప‌ని చేయ‌ని స్థాయిలో ఒకే మ్యుటేష‌న్‌తో వైర‌స్ బ‌ల‌ప‌డిపోద‌ని జెస్సీ బ్లూమ్ స్ప‌ష్టం చేశారు. ఇది కొన్నేళ్ల పాటు జ‌రిగే ప్ర‌క్రియ అని తెలిపారు. 


logo