ఆదివారం 28 ఫిబ్రవరి 2021
International - Jan 19, 2021 , 14:39:27

అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..

అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..

వాషింగ్టన్‌ : అమెరికా నూతన అధ్యక్షుడిగా జోసెఫ్‌ బైడెన్‌ ఈ నెల 20 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో ఉపాధ్యక్షురాలుగా కమలా దేవి హారిస్‌ కూడా ప్రమాణం చేయనున్నారు. ఇదే రోజున మాజీ అధ్యక్షుడుగా మారే డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌ హౌస్‌ను వీడనున్నారు. ఈ నేపథ్యంలో క్యాపిటల్‌ హిల్‌ ప్రాంగణంలో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంతో అమెరికా కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. దాదాపు 11 వారాల కాల వ్యవధిలో తమ టీం ఎంపికపై బైడెన్‌, కమలా హారిస్‌.. పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. కాబోయే అధ్యక్షుడు తన టీంను ఇదే వేదిక నుంచి ప్రకటించనున్నారు. అమెరికాలో మంత్రులను సెక్రటరీలుగా పిలుస్తారు. అమెరికా ప్రభుత్వంలో ఉండే 15 ప్రధాన విభాగాలకు సెక్రటరీలను నియమించి పరిపాలన సమర్ధంగా నిర్వహించేందుకు అధ్యక్షుడు చర్యలు తీసుకుంటారు.

మంత్రులను ఎలా నిర్ణయిస్తారు..?

అమెరికాలో క్యాబినెట్ ఏర్పాటు భారతదేశంలో విధానానికి భిన్నంగా ఉంటుంది. ప్రెసిడెంట్‌, వైస్‌ప్రెసిడెంట్‌తోపాటు 15 మంది మంత్రులు ఉంటారు. వీరంతా క్యాబినెట్ మంత్రులుగా వ్యవహరిస్తారు. తరువాత వారు పనిని ఇతర అధికారుల మధ్య విభజిస్తారు. అనగా ఒక్కొక్క మంత్రి తమ స్వంత బృందాలను తయారు చేసుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమెరికాలో మంత్రి లేదా కార్యదర్శిగా నియమితులు కావాలంటే.. ఆ వ్యక్తి ఎంపీగా ఎన్నికవడం గానీ లేదా రాజకీయాలతో సంబంధం కలిగి ఉండటం గానీ అవసరం లేదు. ఎవరినైనా మంత్రులుగా నియమించుకునే అధికారం ప్రెసిడెంట్‌కు ఉంటుంది. వారికి నచ్చిన, అవసరమైన వ్యక్తులను మంత్రులు లేదా కార్యదర్శులుగా అధ్యక్షుడు నియమించుకుంటారు. పలుసార్లు ప్రత్యర్థి పార్టీ నాయకులను కూడా మంత్రులుగా నియమించారు.ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రెసిడెంట్‌ తన దృష్టిలో అర్హత ఉన్న వ్యక్తిని కార్యదర్శిగా తయారు చేయవచ్చు. 15 మంది కార్యదర్శులతోపాటు మరికొంతమందికి క్యాబినెట్ ర్యాంకు లభిస్తుంది. వీరిలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత రాయబారి ఉన్నారు. ఇలాంటి వారు 7 లేదా 8 మంది ఉండవచ్చు.

వైట్‌హౌస్‌ డాట్‌ గోవ్ వెబ్‌సైట్‌ ప్రకారం.. అధ్యక్షుడిగా ఎన్నుకోబడినవారు క్యాబినెట్ సభ్యుల పేర్లను నిర్ణయిస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సెనేట్ ఈ పేర్లకు ఆమోదముద్ర వేస్తుంది. కొన్ని పేర్లకు అభ్యంతరం కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. సెనేట్ కమిటీలు సంబంధిత మంత్రి గురించిన సమాచారాన్ని సేకరించి ఆ వ్యక్తి యొక్క రికార్డును పరిశీలిస్తుంది. కార్యదర్శిగా తీసుకునే వ్యక్తి యొక్క రికార్డు తప్పుపట్టలేనిదిగా ఉండడం చాలా ముఖ్యం. సెనేట్‌ ఆమోదముద్ర వేయగానే వీరంతా మంత్రులుగా ప్రమాణం చేస్తారు.

ఇవి కూడా చదవండి..

అమ్మో! సూది మందా? నాకు భయ్యం..

తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన ఇందిరమ్మ

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo