శనివారం 06 జూన్ 2020
International - May 23, 2020 , 18:40:16

రేపు జెరూసలేం జిల్లా కోర్టుకు నెతన్యాహు

రేపు జెరూసలేం జిల్లా కోర్టుకు నెతన్యాహు

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు రేపు జెరూసలేం జిల్లా కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఓటమి అనేది ఎరుగకుండా సుదీర్ఘ కాలం ఇజ్రాయెల్‌ ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా గత ఏడాది రికార్డు పుటల్లోకి ఎక్కిన నెతన్యాహు.. ఇప్పుడు అందుకు భిన్నమైన రికార్డును మూటగట్టుకోబోతున్నారు. ప్రధాని హోదాలో ఉండి కోర్టు విచారణ ఎదుర్కొంటున్న మొట్టమొదటి ఇజ్రాయెల్‌ ప్రధానిగా ఆయన రికార్డు పుటల్లో ఎక్కబోతున్నారు. 

బెంజామిన్‌ నెతన్యాహు గత దశాబ్ద కాలానికిపైగా ఇజ్రాయెల్‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పదేండ్ల కాలంలో ఆయనపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. లంచాలు తీసుకున్న ఆరోపణలపై పలు కేసులు నమోదయ్యాయి. అంతేగాక సంపన్నులైన స్నేహితుల నుంచి కాటన్‌ల కొద్ది సారాయిని, సిగార్లను లంచంగా తీసుకుని అందుకు బదులుగా వారికి ప్రతిఫలాలు అందజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

అంతేగాక ప్రముఖ మీడియా సంస్థలకు ప్రభుత్వ ఫలాలు అందజేస్తూ అందుకు ప్రతిగా నెతన్యాహు తనకు, తన కుటుంబానికి మీడియా కవరేజీ ఇప్పించుకుంటున్నారన్న ఆరోపణతో కేసు నమోదైంది. అంతేగాక ఒక టెలికం కంపనీ ఓనర్‌కు ప్రభుత్వం నుంచి వందల కోట్ల లబ్ధి చేకూరేలా నెతన్యాహు నిర్ణయాలు చేసినట్లు కూడా ప్రధాన ఆరోపణ ఉన్నది. అయితే తనపై వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని నెతన్యాహు కొట్టిపారేస్తున్నారు. తప్పుడు కేసులతో తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతున్నదని ఆయన ఆరోపించారు.


logo