జెరుసలాం: ఫైజర్ టీకాలు తీసుకున్న వారిలో మైయోకార్డిటిస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. గుండె పొరల్లో స్వల్ప స్థాయిలో వాపును గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ముఖ్యంగా పురుషుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కానీ ఫైజర్ సంస్థ మాత్రం అలాంటి కేసులను అధిక సంఖ్యలో గుర్తించలేదని పేర్కొన్నది. ఇజ్రాయిల్‌లో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మే వరకు మొత్తం 275 మైయోకార్డిటిస్ కేసులు నమోదు అయ్యాయి. ఆ దేశంలో ఇప్పటి వరకు 50 లక్షల మందికి టీకాలు వేశారు.
టీకా తీసుకున్న వారిపై అధ్యయనం చేసిన డేటాను ఆ దేశ ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గుండె పొరల్లో వాపు వచ్చిన రోగులు హాస్పిటళ్లలో నాలుగు రోజుల కన్నా ఎక్కవ గడపలేదని పేర్కొన్నది. 95 శాతం కేసులను స్వల్ప స్థాయిగానే గుర్తిస్తున్నారు. ఫైజర్ రెండవ డోసు తీసుకున్న తర్వాత.. 16 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో మైయోకార్డిటిస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు స్టడీలో తేల్చారు.
ఇజ్రాయిల్ నిపుణులు గుర్తించిన మయోకార్డిటిస్ లక్షణాలను స్టడీ చేస్తున్నట్లు ఫైజర్ సంస్థ పేర్కొన్నది. కానీ వ్యాక్సిన్‌తో లింకు ఉన్నట్లు ఇంకా గుర్తించలేదని చెప్పింది. సైడ్ ఎఫెక్ట్స్ గురించి వ్యాక్సిన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు.. మైయోకార్డిటిస్ మధ్య ఏదైనా లింకు ఉందా లేదా అన్న కోణంలో అధ్యయనం చేయాలని అమెరికా అంటువ్యాధి నిపుణుల సంస్థ ఇప్పటికే ప్రతిపాదన చేసింది.