సోమవారం 01 జూన్ 2020
International - May 06, 2020 , 01:53:09

యాంటీబాడీ సిద్ధం!

యాంటీబాడీ సిద్ధం!

  • తమ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారనిఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ప్రకటన

జెరూసలేం: కరోనా వైరస్‌ను అంతమొందించే యాంటీబాడీని అభివృద్ధి చేయడంలో తమ దేశానికి చెందిన పరిశోధకులు కీలక ముందడుగు వేసినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి నెఫ్తాలీ బెన్నెట్‌ ప్రకటించారు. ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో పనిచేసే ‘ఇజ్రాయెల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ రీసెర్చ్‌' (ఐఐబీఆర్‌) పరిశోధనశాలలను బెన్నెట్‌ సోమవారం సందర్శించినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైరస్‌పై దాడిచేసే యాంటీబాడీని ఆయన పరిశీలించినట్లు పేర్కొంది. యాంటీబాడీ అభివృద్ధి పూర్తయిందని, పేటెంట్‌ కోసం ఐఐబీఆర్‌ ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపింది. తదుపరి దశలో వాణిజ్య పరంగా పెద్ద ఎత్తున యాంటీబాడీలను ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ తయారీ సంస్థలను సంప్రదించనున్నట్లు వెల్లడించింది. తమ పరిశోధకులు ఈ ఘనత సాధించడం గర్వకారణమని బెన్నెట్‌ అన్నారు.

జపాన్‌, ఇటలీ తదితర దేశాల నుంచి శాంపిల్స్‌

డిఫెన్స్‌ ఫోర్సెస్‌ సైన్స్‌ కార్ప్స్‌లో భాగంగా 1952లో ఐఐబీఆర్‌ను నెలకొల్పారు. అనంతరం దాన్ని పౌరసంస్థగా మార్చారు. సాంకేతికంగా ఇది పీఎంవో పర్యవేక్షణలో పనిచేసినా, రక్షణమంత్రే దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. కొవిడ్‌కు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసేందుకు అన్ని వనరులను వినియోగించుకోవాలని ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఫిబ్రవరి 1న ఆ సంస్థను ఆదేశించారు.  జపాన్‌, ఇటలీ, ఇతర దేశాలనుంచి వైరస్‌ శాంపిళ్లను ఇజ్రాయెల్‌కు తెప్పించినట్లు గత ఫిబ్రవరిలో యెనెట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. మైనస్‌ 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో వాటిని భద్రపరిచినట్లు తెలిపింది. అప్పటి నుంచి వ్యాక్సిన్‌ అభివృద్ధికి నిపుణుల బృందం కృషిచేస్తున్నట్లు వివరించింది. ఒక వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయాలంటే ఏడాదిన్నర సమయం పట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. 


logo