శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Oct 08, 2020 , 13:49:06

క‌మ‌లా హారిస్ హిందువేనా.. ?

క‌మ‌లా హారిస్ హిందువేనా.. ?

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా క‌మ‌లా హారిస్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.  కాలిఫోర్నియా సేనేట‌ర్ క‌మ‌లా హారిస్‌కు భార‌తీయ మూలాలు ఉన్నాయి. కానీ ఆమె హిందువేనా అన్న ప్ర‌శ్న ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది.  అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భాగంగా ఇవాళ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థులు డిబేట్‌లో పాల్గొన్నారు. దానికి పూర్వం ఇంట‌ర్నెట్‌లో క‌మ‌లా హారిస్ మూల‌ల గురించి ఇంట‌ర్నెట్‌లో ఎక్కువ సెర్చ్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  క‌మ‌లా హారిస్ హిందూ మ‌త విశ్వాసాల‌ను న‌మ్ముతుందా అని కొంద‌రు గూగుల్‌లో వెతికారు.  నిజానికి సూటిగా చెప్పాలంటే.. క‌మ‌లా హారిస్ క్రైస్త‌వ మ‌తాన్ని అనుస‌రిస్తున్నారు.  ఆమె బాప్టిస్టు.  వృత్తి రీత్యా బాధ్య‌త‌లు తీసుకున్న స‌మ‌యంలో ఆమె బైబిల్‌పై ప్ర‌మాణం చేశారు.  కానీ క‌మ‌లా హారిస్ గురించి సూక్ష్మంగా ఆలోచిస్తే, ఆమె బ‌హుమ‌తాల స‌మ్మేళ‌నంగా నిలుస్తున్నారు. భిన్న మ‌తాల‌కు చెందిన కుటుంబంలో ఆమె జ‌న్మించారు.  క‌మ‌లా హారిస్ తండ్రిది జ‌మైకా.  ఆయ‌న క్రిస్టియ‌న్‌. త‌ల్లి శ్యామ‌లా గోపాల‌న్‌ది ఇండియా.  త‌మిళ‌నాడులోని చెన్నైలో క‌మ‌లా హారిస్ బంధువులున్నారు. కానీ అమెరికాలో స్థిర‌ప‌డ్డ క‌మ‌లా పేరెంట్స్‌.. న‌ల్ల‌జాతీయులు వెళ్లే బాప్టిస్టు చ‌ర్చితో పాటు హిందూ ఆల‌యాన్ని కూడా విజిట్ చేసేవారు.  క‌మ‌లా హారిస్ భ‌ర్త డ‌గ్ల‌స్ ఎమ్మాహ్ మాత్రం యూద మ‌త‌స్థుడు.   

క‌మ‌లం అంటే పుష్పం. భార‌తీయ సంస్కృతిలో ఆ పుష్పానికి విశిష్ట స్థానం ఉన్న‌ది.  చిన్న‌త‌నంలో క‌మ‌ల‌తో పాటు ఆమె సోద‌రి మాయా ఇంట్లో బ్లాక్ అమెరిక‌న్ ఆర్టిస్టుల మ్యూజిక్ వింటూ పెరిగారు. క‌మ‌లా త‌ల్లి శ్యామ‌ల క్రైస్తవ కీర్త‌న‌లు పాడేది. క‌మ‌ల అయిదేళ్ల వ‌య‌సులోనే తండ్రి డోనాల్డ్ హారిస్ .. శ్యామ‌ల‌ను వ‌దిలివెళ్లారు. క్యాన్స‌ర్ ప‌రిశోధ‌కురాలిగా, పౌర హ‌క్కుల కార్య‌క‌ర్త‌గా శ్యామ‌ల అమెరికాలో ఒంట‌రి జీవితాన్ని సాగించారు. త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌కు శ్యామ‌ల‌.. త‌మ కుటుంబం మూలాల గురించి చెప్పేవారు.  అమెరిక‌న్ అని చెప్పుకుంటున్న క‌మ‌లా హారిస్‌కు.. క్రైస్త‌వ‌, హిందూ ఆచారాలు పూర్తిగా తెలుసు. ద‌క్షిణ‌భారత వంట‌కాల‌ను క‌మ‌లా వండిన‌ట్లు కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది. ఇంట్లో అన్నం, గుడ్డు, ఆలు, ప‌ప్పు వండేవార‌ని, ఇడ్లీ కూడా చేసేవార‌ని క‌మ‌లా ఓ పుస్త‌కంలో తెలిపారు  

అమెరికా రాజ‌కీయాల్లో ఆఫ్రో-అమెరిక‌న్ సంత‌తి వ్య‌క్తిగా క‌మ‌లా హారిస్ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు.  ఉపాధ్య‌క్షురాలిగా హారిస్ పోటీప‌డ‌డం హ‌ర్ష‌ణీయ‌మే అయినా.. భార‌తీయ సంత‌తి ఓట‌ర్ల‌లో భిన్న‌స్వ‌రాలు వినిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌శ్మీరీ స్వ‌యంప్ర‌తిప‌త్తిపై ప్ర‌ధాని మోదీ తీసుకున్న నిర్ణ‌యాన్ని క‌మ‌లా హారిస్ త‌ప్పుప‌ట్టారు.  ఈ అంశంలో మోదీ అభిమానులు ఆమెకు దూరం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.  అమెరికా ఎన్నిక‌ల్లో భార‌తీయ ఓట‌ర్లు అత్యంత కీల‌కం. వాస్త‌వానికి భార‌తీయ ఓట‌ర్లు ఎక్కువ‌గా డెమోక్ర‌టిక్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. కానీ మోదీ-ట్రంప్ దోస్తీ ఇప్పుడు భార‌త సంత‌తి ఓట‌ర్ల‌ను కొంత ఇర‌కాటంలో ప‌డేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇక అమెరికాలోని భార‌తీయ ఓట‌ర్లు ఎవ‌ర్ని గెలిపిస్తోరో వేచి చూడాల్సిందే.