గురువారం 16 జూలై 2020
International - May 27, 2020 , 22:00:43

పరువు హత్యలకు కఠిన శిక్షలు

పరువు హత్యలకు కఠిన శిక్షలు

టెహ్రాన్‌: పరువు హత్యలను నివారించేందుకు ఇరాన్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్నది. పరువు హత్యలకు దిగే వారిని కఠినంగా శిక్షించేలా కొత్త చట్టం తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఈ బిల్లును వీలైనంత త్వరగా తీసుకురావాలని ఆ దేశాధ్యక్షుడు హసన్‌ రౌహానీ అధికారులకు సూచించారు. పరువు హత్యల కారణంగా ఆడపిల్లలు దారుణహత్యలకు గురవుతున్నారని, వీటిని నివారించేందుకు కఠిన శిక్షలను అమల్లోకి తేవాల్సిన అవసరమున్నదని రౌహానీ నొక్కిచెప్పారు. 

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు వాయవ్యంగా 320 కిలోమీటర్ల దూరంలోని తలేష్‌లో గత వారం యువతి రోమినా అష్రాఫీని ఆమె తండ్రే దారుణహత్య చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. తలేష్‌ గ్రామానికే చెందిన 34 ఏండ్ల యువకుడు బహమ్న్‌ ఖవారితో రోమినా ప్రేమలో పడి ఇంటి నుంచి పారిపోయింది. ఐదు రోజుల తర్వాత వారిని కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వారి పెండ్లి చెస్తానని నమ్మించాడు. తీరా రోమినా తన ఇంట్లో నిద్రిస్తుండగా వ్యవసాయ పనుల్లో వాడే కొడవలితో గొంతు కోసి చంపేశాడు. 14 ఏండ్ల బాలిక పరువుహత్యకు గురవడంతో దేశవ్యాప్తంగా  నిరసనలు మిన్నంటాయి. దాంతో దేశాధ్యక్షుడు హసన్‌ రౌహానీ క్యాబినెట్‌ సమావేశంలో తీవ్రంగా చర్చించి చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇకపై ఎవరైనా పరువు హత్యలకు ఒడిగడితే కఠినంగా శిక్షించేలా సిద్ధం చేస్తున్న బిల్లు ఆమోదం తుది దశలో ఉన్నదని కుటుంబ వ్యవహారాల ఇంచార్జి మసౌమెహ్‌ ఎబ్టేకర్‌ తెలిపారు.


logo