బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 21, 2020 , 11:20:38

అమెరికాను రెచ్చగొట్టొద్దు : ఇరాన్‌

అమెరికాను రెచ్చగొట్టొద్దు : ఇరాన్‌

బాగ్దాద్‌ :  అమెరికాతో నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో ఆ దేశాన్ని రెచ్చగొట్టొద్దని మధ్యప్రాచ్యంలోని మిత్రదేశాలకు ఇరాన్‌ సూచించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం చివరి కాలంలో పాలనా యంత్రాంగాన్ని దాడులకు ప్రేరేపించొద్దని హెచ్చరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫలితాలపై ట్రంప్‌ అనూహ్య ప్రవర్తన, అధికారాల బదలాయింపుపై నెలకొన్న అనిశ్చితిపై ఇరాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమిని ఇరాన్‌ మిత్ర దేశాలు సంయుక్తంగా స్వాగతించాయి. ట్రంప్‌ ఆధ్వర్యంలో ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఏడాది మొదట్లో బాగ్దాద్‌ విమానాశ్రయంలో ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసిం సులేమానిని అమెరికా సైన్యం వైమానిక దాడి జరిపి హతమార్చిన తర్వాత మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాక్‌లో అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకొని, డ్రోన్‌ దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణితో దాడి చేసింది.

2018లో ట్రంప్‌ ఇరాన్‌ను అణు ఒప్పందం నుంచి తప్పించారు. అలాగే అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు  చేశారు. అణు పరీక్షల విషయంలో 2015లో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ)లో నిబంధనల్ని ఆ దేశం ఉల్లంఘిస్తోందని ట్రంప్‌ ప్రభుత్వం ఆరోపిస్తూ నోటీసులు జారీ చేసి, నెల రోజుల్లోపై ఆంక్షలు విధించింది. పలు దేశాలు సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నిక కావడంతో 2015 అణు ఒప్పందంలో తిరిగి చేరాలని ఇరాన్‌ భావిస్తోంది. ఈ మేరకు సంప్రదింపులు జరిపేందుకు ప్రణాళికలు వేస్తోంది.

కానీ, ట్రంప్‌ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు నిరాకరిస్తున్న వేళ తన పదవి చివరి కాలంలో ఏమైనా చేయగలరనే ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత గురువారం ఇరాన్‌ సుప్రీం నాయకుడి సలహాదారు అసోసియేటెడ్‌ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే ఈ ప్రాంతంలో ‘పూర్తిస్థాయి యుద్ధాన్ని’ ప్రారంభించవచ్చని హెచ్చరించారు. ‘మేం యుద్ధాన్ని స్వాగతించడం లేదని అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆధ్వర్యంలో రక్షణ మంత్రిగా మారడానికి ముందు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌లో పనిచేసిన హుస్సేన్ డెహగాన్ అన్నారు. వాస్తవానికి రెండు జనవరి మధ్య నాటికి మిషన్‌ను పూర్తి చేసుకొని తిరిగి రావాలని అమెరికా సైన్యానికి అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు. కాగా, అయితే ఇటీవల ట్రంప్‌ ఇరాన్‌ ప్రధాన అణుస్థావరంపై దాడి చేసేందుకు ఉన్న మార్గాల్ని సూచించాలని అధికారులను కోరినట్టు ప్రచారం జరిగింది.

ట్రంప్‌ నిర్ణయాన్ని అధికారులు అంగీకరించలేదని, ఇరాన్‌పై దాడి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అధికారులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గినట్లుగా తెలిసింది. ఇటీవల బాగ్దాగ్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడులు పెరిగాయి. బాగ్దాగ్‌లో ఈ వారంలో ఇరానియన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలిటెంట్లు, షియా రాజకీయ నాయకులతో ఒక సమావేశం నిర్వహించారు. ఇరాక్‌లో అమెరికా ఉనికిపై ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండాలని, దాడులను విరమించాలని సూచించారు. లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న తీవ్రవాది హిజ్బుల్లా గ్రూప్‌ నాయకుడు హసన్ నస్రల్లా, ట్రంప్ పదవి చివరి కాలంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.