మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 13, 2020 , 14:00:19

ఇరాన్‌లో అంత‌ర్జాతీయ క్రీడాకారుడికి మ‌ర‌ణ‌శిక్ష‌!

ఇరాన్‌లో అంత‌ర్జాతీయ క్రీడాకారుడికి మ‌ర‌ణ‌శిక్ష‌!

టెహ్రాన్‌: ఇరాన్‌ ప్రభుత్వం ఓ అంత‌ర్జాతీయ‌ క్రీడాకారుడికి మరణశిక్షను అమలు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక నిర‌స‌న‌ ప్రదర్శనలో పాల్గొని ఓ సెక్యూరిటీ గార్డును హత్య చేశాడన్న ఆరోప‌ణ‌ల‌పై గ‌తంలో ఆయ‌నకు మ‌ర‌ణ‌శిక్షప‌డ‌గా.. తాజాగా ప్ర‌భుత్వం ఆ శిక్ష‌ను అమ‌లుచేసింది. నవీద్‌ అఫ్కారీ (27) ఇరాన్‌కు చెందిన అంత‌ర్జాతీయ స్థాయి రెజ్లర్‌. అయితే, 2018లో జరిగిన ఓ ప్రభుత్వ వ్య‌తిరేక ఆందోళనలో నవీద్ పాల్గొన్నాడు. ఆ ఆందోళ‌న సంద‌ర్భంగా న‌వీద్ ఒక‌ సెక్యూరిటీ గార్డును హత్య చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదైంది. 

అయితే, ఇరాన్ ప్ర‌భుత్వ ఆరోప‌ణ‌ల‌ను అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పూర్తిగా ఖండించింది. నవీద్‌కు మరణశిక్షను నిలిపివేయాలని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 వేల మంది అథ్లెట్లు ఇరాన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. న‌వీద్‌ను అన్యాయంగా లక్ష్యంగా మార్చుకున్నార‌ని ది వరల్డ్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ పేర్కొన్న‌ది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా నవీద్‌కు క్షమాభిక్ష పెట్టాల‌ని కోరాడు. నవీద్‌పై చర్య విచారకరమని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ పేర్కొన్న‌ది. అయినా, ఇరాన్ ప్ర‌భుత్వం మాత్రం ఉరిశిక్ష‌ను అమ‌లుచేసింది.  

కాగా, మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు అనంత‌రం నవీద్‌కు చెందిన ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. 'నాకు మరణశిక్ష అమలు చేస్తే మీకో విషయం తెలియ‌జేయాల‌నుకుంటున్నా. స్వశక్తిపై పోరాటం చేయాలనుకుంటున్న వ్యక్తి ప్రాణాలు తీశారు' అని ఆడియో టేపులో ఉంది. కాగా, నవీద్‌ను చివరిసారి చూసేందుకు అతని కుటుంబానికి కూడా కనీసం అవకాశం కల్పించలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo