శుక్రవారం 15 జనవరి 2021
International - Dec 03, 2020 , 15:15:28

న‌కిలీ కొవిడ్ వ్యాక్సిన్స్ అమ్ముతా‌రు.. జాగ్ర‌త్త‌: ఇంట‌ర్‌పోల్‌

న‌కిలీ కొవిడ్ వ్యాక్సిన్స్ అమ్ముతా‌రు.. జాగ్ర‌త్త‌: ఇంట‌ర్‌పోల్‌

న్యూఢిల్లీ: వ‌్య‌వ‌స్థీకృత నేరాల‌కు పాల్ప‌డే వాళ్లు న‌కిలీ కొవిడ్ వ్యాక్సిన్స్‌ను అమ్ముతారు జాగ్ర‌త్త అంటూ ఇంట‌ర్‌పోల్ హెచ్చ‌రించింది. ఈ మేర‌కు 194 దేశాల్లోని అన్ని పోలీసు వ్య‌వ‌స్థ‌ల‌కు ఆరెంజ్ నోటీస్ జారీ చేసింది. ప్ర‌పంచంలోనే తొలిసారిగా ఫైజ‌ర్ వ్యాక్సిన్‌కు యూకే అనుమ‌తించిన రోజే ఇంట‌ర్‌పోల్ ఈ వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. కొవిడ్ వ్యాక్సిన్‌ల‌కు సంబంధించి జ‌రిగే న‌కిలీలు, చోరీలు, అక్ర‌మ వ్యాపారాల‌పై ఓ క‌న్నేసి ఉంచాల‌ని సూచించింది. న‌కిలీ వ్యాక్సిన్‌ల‌ను అడ్వ‌ర్‌టైజ్ చేయ‌డం, అమ్మ‌డం చేస్తున్న నేరాల‌కు సంబంధించిన సంఘ‌ట‌న‌ల‌ను కూడా ఇంట‌ర్‌పోల్ వివ‌రించింది. ప్ర‌జా భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లజేసే ఏదైనా ఘ‌ట‌న‌, ప్ర‌క్రియ జ‌రిగే స‌మ‌యంలో ఇంట‌ర్‌పోల్ ఇలా ఆరెంజ్ నోటీసు జారీ చేస్తుంది. 

ఇండియాలో సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ).. ఇంట‌ర్‌పోల్‌తో క‌లిసి ప‌ని చేస్తుంది. వ్యాక్సిన్ పంపిణీ కార్య‌క్ర‌మం సుర‌క్షితంగా జ‌రగాల‌ని అన్ని దేశాల‌ పోలీసు వ్య‌వ‌స్థ‌ల‌ను ఇంట‌ర్‌పోల్ కోరింది. ఇందులో భాగంగా న‌కిలీ వ్యాక్సిన్‌ల‌ను విక్ర‌యించే అక్ర‌మ వెబ్‌సైట్ల‌ను గుర్తించ‌డం అత్య‌వ‌స‌ర‌మ‌ని సూచించింది. న‌కివీ వెబ్‌సైట్ల ద్వారా ప్ర‌జల‌ను త‌మవైపు తిప్పుకోవ‌డానికి నేర‌గాళ్లు ప్ర‌య‌త్నించే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని, ఇది వారి ఆరోగ్యం, ప్రాణాల‌కు ముప్పు తెస్తుంద‌ని ఇంట‌ర్‌పోల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జుర్గెన్ స్టాక్ హెచ్చ‌రించారు. ఇలా న‌కిలీ వ్యాక్సిన్‌ల‌ను అమ్మ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న 3 వేల న‌కిలీ వెబ్‌సైట్ల‌ను ఇంట‌ర్‌పోల్ ఇప్ప‌టికే గుర్తించింది.