శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 13:29:23

నష్టాల్లో ముగిసిన అంతర్జాతీయ మార్కెట్లు

 నష్టాల్లో ముగిసిన అంతర్జాతీయ మార్కెట్లు

ముంబై : అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా నాస్‌డాక్ 3 శాతం మేర నష్టపోగా, ఎస్ అండ్ పీ సూచీ 2.37 శాతం, డౌజోన్స్ 1.9 శాతం క్షీణించింది. యూరోపియన్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. యూకే ఎఫ్‌టీఎస్ఈ 1.20 శాతం, ఫ్రెంచ్ మార్కెట్ సూచీ సీఏసీ 0.62 శాతం, జర్మన్ డాక్స్ సూచీ 0.39 శాతం మేర స్వల్పంగా లాభపడ్డాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, మహమ్మారి సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన అమెరికా స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. డౌజోన్స్ 525 పాయింట్లు(1.9%) క్షీణించి 26,763 వద్ద, ఎస్ అండ్ పీ 79 పాయింట్లు (2.3) నష్టంతో 3,237 వద్ద, నాస్‌డాక్ 331 పాయింట్లు (3%) నష్టపోయి 10,633 వద్ద స్థిరపడింది.

దీంతో సెప్టెంబర్‌లో నమోదైన చరిత్రాత్మక గరిష్టాల నుంచి ఎస్ అండ్ పీ 10 శాతం, నాస్‌డాక్ 12 శాతం క్షీణించాయి. డౌజోన్స్ ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్ గరిష్టం కంటే 9.4 శాతం దిగువన నిలిచింది. కరెక్షన్‌కు సంకేతంగా భావిస్తున్నారు. ఈ రోజు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. సింగపూర్ నిఫ్టీ 1.95 శాతం, జపాన్ నిక్కీ 1.11 శాతం, హాంగ్‌కాంగ్ హాంగ్ షెగ్ 1.86 శాతం, తైవాన్ వెయిటెడ్ 2.54 శాతం, కొరియా కోస్పి 2.51 శాతం, జకర్తా కాంపోసిట్ ఇండెక్స్ 1.89 శాతం మేర నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నానికి సింగపూర్ నిఫ్టీ స్వల్ప లాభాల్లోకి వచ్చింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo