మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 23, 2020 , 17:38:11

భార్యకు పెళ్లిరోజు కానుకగా చంద్రుడిపై స్థలం కొనిచ్చాడు..!

భార్యకు పెళ్లిరోజు కానుకగా చంద్రుడిపై స్థలం కొనిచ్చాడు..!

రావల్పిండి: భార్యకు అందరూ పెళ్లిరోజు కానుకగా ఏం కొనిస్తారు? బాగా డబ్బున్నవాళ్లైతే కారు, విల్లా, విలువైన ఆభరణాలు కొనిస్తారు. మధ్యతరగతి వాళ్లైతే పట్టుచీర, ఇతర అలంకరణ సామగ్రి లేదా ఓ చిన్న బహుమతి ఏదైనా కొనిస్తారు. కానీ, ఓ పాకిస్తాన్‌ వ్యక్తి ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. తన ప్రియమైన శ్రీమతికోసం వెడ్డింగ్‌ డే రోజు చంద్రమండలంపై ఓ ఎకరం స్థలం కొని, గిఫ్ట్‌గా ఇచ్చాడు. 

పాకిస్తాన్‌లోని రావల్పిండి నివాసి సోహైబ్ అహ్మద్ చంద్రుడిపై 'సీ ఆఫ్ వెపర్‌' ప్రాంతంలో ఎకరం స్థలాన్ని దక్కించుకున్నాడు. దీన్ని ఇంటర్నేషనల్‌ ల్యూనార్‌ ల్యాండ్‌ రిజిస్ట్రీ వద్ద 45డాలర్లకు కొనుగోలు చేశాడు. తాను ఈ ల్యాండ్‌ కొనేందుకు దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేరణగా నిలిచారని సోహైబ్‌ వెల్లడించాడు. 2018 లో సుశాంత్ చంద్రమండలంపై ‘సీ ఆఫ్ మస్కోవి’ అనే ప్రాంతంలో స్థలం కొన్నాడు. అలాగే, హాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖ హీరోలు టామ్ క్రూజ్, షారూఖ్ ఖాన్లతో సహా పలువురు ప్రముఖులకు చంద్రమండలంపై స్థలం ఉంది.   

ఇదిలా ఉండగా, తనకు చంద్రమండలంపై స్థలం ఉందని చెబితే ఎవరూ నమ్మలేదని అహ్మద్‌ సతీమణి మదిహా అన్నారు. మొదట అందరూ ఇది జోక్‌ అని అనుకున్నారట. అనంతరం పేపర్స్‌ చూపిస్తే షాక్‌ అయ్యారని మదిహా చెప్పారు. తన స్నేహితురాలి భర్త కూడా చంద్రుడిపై జాగా కొనాలని నిర్ణయించుకున్నట్లు మదిహా తెలిపారు. కాగా, ఈ జంట యూఎస్ పోస్టల్ సర్వీస్ ద్వారా తమ ఇంటి వద్దే చంద్రునిపై కొన్న భూమి పత్రాలను అందుకున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo