శనివారం 28 నవంబర్ 2020
International - Nov 22, 2020 , 01:34:56

కరోనాపై పోరులో తెలంగాణ తేజం

కరోనాపై పోరులో తెలంగాణ తేజం

  • సమర్థవంతమైన చికిత్సను కనుగొన్న కన్నెగంటి తిరుమలదేవి
  • సైటోకైన్‌ ఆధారిత మార్గం ఆవిష్కరణ
  • అమెరికాలోని సెయింట్‌ జూడ్‌ హాస్పిటల్‌ వైస్‌చైర్‌పర్సన్‌గా తిరుమలదేవి
  • కరోనాపై వినూత్నమైన పరిశోధనలు పరిశోధక బృందంలో తెలుగువారు

వాషింగ్టన్‌, నవంబర్‌ 21: తెలంగాణకు చెందిన భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త కన్నెగంటి తిరుమల దేవి గొప్ప ఆవిష్కరణ చేశారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కబళిస్తున్న కరోనా మహమ్మారికి కళ్లెం వేసేందుకు సమర్థ చికిత్స విధానాన్ని కనుగొన్నారు. కరోనా రోగులకు ప్రాణాంతకంగా పరిణమించే వాపు (ఇన్‌ఫ్లమేషన్‌), ఊపిరితిత్తులు దెబ్బతినడం, అవయవాల వైఫల్యాన్ని నిరోధించే మార్గాన్ని గుర్తించారు. ‘ఇన్‌ఫ్లమేటరీ సెల్‌ డెత్‌' ఎలా జరుగుతుంది, దాన్ని ఏ విధంగా అడ్డుకోవచ్చన్నది కనుగొన్నారు. కొవిడ్‌-19తో ముడిపడి ఉన్న ‘హైపర్‌ ఇన్‌ఫ్లమేటరీ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌'.. కణజాలం దెబ్బతినేందుకు, భిన్న అవయవాల వైఫల్యానికి దారితీస్తున్నట్టు గుర్తించారు. ఇన్‌ఫ్లమేటరీ సెల్‌డెత్‌ పాత్‌వేస్‌ ద్వారా దీన్ని గుర్తించారు. తద్వారా ఆ ప్రక్రియను బ్రేక్‌ చేసే చికిత్స విధానానికి మార్గం సుగమం చేశారు. ఇన్‌ఫ్లమేటరీ సెల్‌డెత్‌ పాత్‌వేస్‌ను యాక్టివేట్‌ చేసే ప్రత్యేక సైటోకైన్లను తాము గుర్తించామని, కొవిడ్‌తోపాటు సెప్సిస్‌ తరహా వ్యాధులకు అడ్డుకట్ట వేసే సామర్థ్యం వీటికి ఉన్నదని తిరుమలదేవి చెప్పారు. ఈ అధ్యయన వివరాలు సెల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

ప్రాణాంతకంగా నిరోధక వ్యవస్థ మారినప్పుడు..

మన రోగనిరోధక వ్యవస్థ అవసరానికి మించి చురుగ్గా మారినప్పుడు, అది వ్యాధులతో పోరాటం చేయడానికి బదులు మన శరీరానికే నష్టం కలిగిస్తుంది. ఆ సమయంలో సైటోకైన్లు ఒక తుఫానులా వచ్చిపడుతాయి. దీనినే సైటోకైన్‌ స్టార్మ్‌ అంటారు. రక్తంలో పెద్దసంఖ్యలో సైటోకైన్లు పేరుకుపోతాయి. దీని వల్ల వాపు, ఊపిరితిత్తులు దెబ్బతినడం, అవయవాల వైఫల్యం జరిగే ప్రమాదమున్నది. కొవిడ్‌-19తోపాటు మరికొన్ని వ్యాధులలో ఇది జరుగుతున్నది. అయితే ఈ సైటోకైన్‌ స్టార్మ్‌కు గల కారణమేంటన్నదానిపై స్పష్టతలేదు. ఈ నేపథ్యంలో తిరుమలదేవి బృందం కొవిడ్‌-19 రోగుల్లో ప్రత్యేక సైటోకైన్లపై దృష్టిసారించింది. అయితే ఇమ్యూన్‌ కణాల మృతికి సింగిల్‌గా ఏ సైటోకైన్‌ కారణం కాదని గుర్తించారు. ఈ నేపథ్యంలో 28 రకాల సైటోకైన్‌ కాంబినేషన్లపై వారు పరిశోధన చేశారు. టీఎన్‌ఎఫ్‌ ఆల్ఫా, ఐఎన్‌ఎఫ్‌ గామా వల్లే కణాలు మృతిచెందినట్లు గుర్తించారు. ఈ సైటోకైన్‌ కాంబినేషన్‌ లక్ష్యంగా చేసుకునే థెరపీలు కొవిడ్‌తోపాటు సైటోకైన్‌ స్టార్మ్‌తో ముడిపడి ఉన్న ఇతర వ్యాధులకు చికిత్స అందించేందుకు దోహదపడుతాయని పరిశోధకులు తెలిపారు.


కాకతీయ, ఉస్మానియాల్లో విద్యాభ్యాసం

తిరుమలదేవి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ అందుకున్నారు. అనంతరం 2007లో అమెరికాలోని టెన్నెసీలో ఉన్న సెయింట్‌ జూడ్‌ చిల్ట్రన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం దానికి వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తాజా పరిశోధన బృందంలో ఆమెతోపాటు బాలాజీ బానోత్‌, సుబ్బారావు మలిరెడ్డి, రాజ్‌శర్మ, రాజేంద్ర కర్కి, శ్రద్ధా తులాధర్‌, పరిమళ్‌ సమీర్‌, బాలమురుగన్‌ సుందరం, ప్యాట్రిక్‌ స్క్రీనర్‌, జాఫ్రీ నియాల్‌, పీటర్‌ వోగెల్‌, రిచర్డ్‌ వెబ్బీ, మిన్‌ జెంగ్‌ తదితరులు ఉన్నారు.