శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 21, 2020 , 17:41:09

కొవిడ్‌ మిరాకిల్‌ క్యూర్‌గా ఇండస్ట్రియల్‌ బ్లీచ్‌ అమ్మకం.. !

కొవిడ్‌ మిరాకిల్‌ క్యూర్‌గా ఇండస్ట్రియల్‌ బ్లీచ్‌ అమ్మకం.. !

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, నిపుణులు వీలైనంత త్వరగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారుచేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. కాగా, కరోనాను నివారించే ఎలాంటి ఔషధాలనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ధ్రువీకరించలేదు. కాగా, కొవిడ్‌-19ను నివారిస్తాయంటూ గత కొన్ని నెలల్లో మార్కెట్‌లోకి చాలా ఉత్పత్తులు వచ్చాయి. చాలామంది ఇవి తమను కరోనా నుంచి రక్షిస్తాయనే ఆశతో వీటిని కొంటున్నారు. 

ది గార్డియన్‌ నివేదిక ప్రకారం.. కొవిడ్‌ మిరాకిల్‌ క్యూర్‌గా పేర్కొంటూ అమెజాన్ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లో ఓ రకమైన ఇండస్ట్రియల్‌ బ్లీచ్‌ను అమ్ముతున్నారు. ఇలాంటి ద్రవాలు తాగడం మరణానికి దారితీయవచ్చని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పలు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా ఈ అమ్మకాలు కొనసాగడం గమనార్హం. 

క్లోరిన్ డయాక్సైడ్ ద్రావణాలతో కూడిన పదార్థాలను అమెజాన్‌లో సీడీ కిట్, నాట్రిక్లోర్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నట్లు గార్డియన్ నివేదిక పేర్కొంది. ప్లాట్‌ఫాంపై బ్లీచ్‌ను 'వాటర్ ట్రీట్‌మెంట్'గా వాడాలని, అంతర్గత ఉపయోగం కోసం మార్కెట్ చేయబడలేదు' అనే హెచ్చరికతో వాటిని విక్రయిస్తున్నారు. అయితే, రివ్యూలో మాత్రం కొందరు తమని తాము డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేసుకునేందుకు కొంత పరిమాణంతో దీన్ని వాడామని పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. ‘చాలామంది దీన్ని ఇప్పటికీ విశ్వసించలేదు. కానీ నాకు మాకు చాలా సహాయపడింది.’ అని ఒక వినియోగదారుడు స్పానిష్‌ భాషలో రాశాడు.  

కరోనా వైరస్‌ను నయం చేసేందుకు బ్లీచ్‌ను వాడితే ఎలా ఉంటుందో నిపుణులు ఆలోచించాలని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొన్ని నెలల క్రితం వ్యాఖ్యానించారు. అయితే, ఇది ఆ దేశంలో చాలామంది నమ్మారు. తత్ఫలితంగా, దేశంలోని అనేక దవాఖానల్లో బ్లీచ్‌ తాగి విషమ స్థితికి చేరిన కేసులు వెలుగుచూశాయి.  అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పాయిజన్ కంట్రోల్ సెంటర్లలో క్లోరిన్ డయాక్సైడ్ పాయిజనింగ్ కేసులు 16,000 కు పైగా నమోదయ్యాయని గార్డియన్ నివేదించింది. 

అమెజాన్‌లో బ్లీచ్ విషయానికొస్తే, ఇది వాస్తవానికి వస్త్ర తయారీ, గుజ్జు మరియు కాగితం బ్లీచింగ్ లాంటి పారిశ్రామిక ప్రక్రియలలో ఉపయోగిస్తారు. నీటిని క్రిమిసంహారకం చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. కానీ చిన్న మోతాదులో మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తప్పుడు ప్రకటనలు ఉన్న ఏవైనా ఉత్పత్తులను తీసివేస్తామని కంపెనీ వాగ్దానం చేసిన తర్వాత కూడా ఈ ఉత్పత్తి అమెజాన్‌లో కనిపించింది. ఈ ఉత్పత్తులను ఫ్లోరిడాలో ఉన్న కీవిస్ కార్నర్ అనే సంస్థ పేరుతో విక్రయిస్తున్నారు. అయితే, దాని యజమాని, స్టీవ్ పార్డీ మాట్లాడుతూ, కుక్కలు, గుర్రాలను శుభ్రపరిచేందుకుగానూ ఈ బ్లీచ్‌ను అమెజాన్‌లో విక్రయానికి ఉంచినట్లు తెలిపారు. ఇది కొవిడ్‌ -19 నివారిణిగా పనిచేయదని చెప్పారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo