శనివారం 30 మే 2020
International - Apr 01, 2020 , 11:42:17

ద‌క్షిణాఫ్రికాలో భార‌త సంత‌తి వైరాల‌జిస్టు మృతి

ద‌క్షిణాఫ్రికాలో భార‌త సంత‌తి వైరాల‌జిస్టు మృతి

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన శాస్త్ర‌వేత్త‌, ప్ర‌ముఖ వైరాల‌జిస్టు గీతా రామ్‌జీ (50) ద‌క్షిణాఫ్రికాలో మృతిచెందారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆమె మృతిచెందిన‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ సైంటిస్టు, హెచ్‌ఐవీపై పరిశోధకురాలు అయిన ప్రొఫెసర్‌ గీతా రామ్‌జీ దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. దక్షిణాఫ్రికాలోనే స్థిరపడ్డ భారత సంతతికి చెందిన ఫార్మసిస్ట్‌ ప్రవీణ్‌ రామ్‌జీని ఆమె వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం గీతా రామ్‌జీ దక్షిణాఫ్రికా వైద్య పరిశోధన మండలిలోని క్లినికల్‌ ట్రయల్స్‌ విభాగంలో ముఖ్య పరిశోధకురాలిగా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా హెచ్‌ఐవీ నిర్మూలనపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. అయితే, ఆమె ఇటీవ‌ల‌ అనారోగ్యానికి గుర‌వ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా.. చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం మృతించెందారు. కాగా, క‌రోనా ల‌క్ష‌ణాల‌తోనే ఆమె మ‌ర‌ణించార‌ని దక్షిణాఫ్రికా వైద్య పరిశోధన మండలి ప్ర‌క‌టించింది. గీతా రామ్‌జీ ఆక‌స్మిక‌ మరణం తమను ఎంతగానో కలచివేసిందని మండ‌లి అధ్య‌క్షుడు గ్లెండా గ్రే ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

గీతా రామ్‌జీ పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ల‌భించింది. దీంతో ఎన్నో అవార్డులను ఆమె సొంత చేసుకున్నారు.  ఇదిలావుంటే, క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ద‌క్షిణాఫ్రికాలో ఇప్పటికే ఐదుగురు మరణించగా భారత సంతతికి చెందిన తొలికేసు ఇదే. కాగా, ద‌క్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 1350 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే, వైర‌స్ తీవ్ర‌త ఎక్కువగా ఉండడంతో దక్షిణాఫ్రికా ప్ర‌భుత్వం సైతం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించింది. 


logo