మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Oct 28, 2020 , 13:03:03

భారతీయ పాస్‌పోర్ట్‌లో యూఏఈ అడ్రస్‌!

భారతీయ పాస్‌పోర్ట్‌లో యూఏఈ అడ్రస్‌!

దుబాయి : యూఏఈలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఇకపై తమ పాస్‌పోర్టులో విదేశాల్లోని స్థానిక చిరునామాను చేర్చుకోవచ్చని దుబాయిలోని ఇండియన్‌ కాన్సుల్‌, పాస్‌పోర్ట్‌, అటెస్టేషన్‌ సిద్ధార్థ కుమార్‌ బరైలీ తెలిపారు. భారత ప్రభుత్వం ప్రవాస భారతీయుల కోసం నివాస దేశంలోని స్థానిక చిరునామాను, ప్రధానంగా భారతదేశంలో శాశ్వత, చెల్లుబాటయ్యేలా చిరునామాలేని వారికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. చాలాకాలంగా యూఏఈలో ఉంటున్న చాలా మందికి ఇండియాలో సరైన చిరునామా లేదని మాకు అర్థమైందని, వారు తమ పాస్‌పోర్టుల్లో స్థానిక యూఏఈలో ఉంటున్న అడ్రస్‌ను జోడించవచ్చని చెప్పారు. కాగా, ఇప్పటికే ఉన్న పాస్‌పోర్ట్‌లలో అడ్రస్‌లు మార్పులు చేయలేమని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా పాస్‌పోర్ట్‌ తీసుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

అద్దె, సొంత చిరునామాల్లో ఉంటున్న ప్రవాసీయులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యుత్‌, నీటి బిల్లు, యూఏఈలో ఉంటున్నట్లుగా అద్దె ఒప్పంద ప్రతం పత్రాలు అందజేయాలి ఉంటుందని బరైలీ పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ సమయంలో దరఖాస్తుదారులు భారతదేశం నుంచి వేగంగా పోలీస్‌ వెరిఫికేషన్‌ పొందడానికి వారి చిరునామాను మార్చుకోవచ్చు. సెప్టెంబర్‌ నుంచి అమలులోకి వచ్చిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పాలసీ మార్పు మేరకు.. భారతీయులందరి పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌కు పోలీసుల ధ్రువీకరణ తప్పనిసరి. అయితే విదేశాల్లో ఉన్న భారతీయుల పోలీస్‌ వెరిఫికేషన్‌ ద్వారా దరఖాస్తు దారుడి చిరునామా వెరిఫికేషన్‌ చేయనవసరం లేదని స్పష్టం చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.