మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 08, 2020 , 19:27:30

జర్మనీ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన భారతీయ మహిళ

జర్మనీ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన భారతీయ మహిళ

బెర్లిన్: భారత్‌కు చెందిన ఒక మహిళ జర్మనీలోని ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. నాలుగు రోజులుగా లాంజ్‌లోనే ఉంటున్న ఆమె సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. భారతీయురాలైన ప్రియా మెహతా దుబాయ్‌లోని ఒక యాడ్ సంస్థలో పని చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన బంధువులను చూసేందుకు ఇటీవల దుబాయ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. దుబాయ్‌కు తిరిగి వెళ్లేందుకు జూలై 4న శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్ పోర్టుకు అక్కడి నుంచి దుబాయ్ వెళ్లే విమానానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత దుబాయ్‌కు వెళ్లే విమానంలో ప్రయాణించేందుకు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ఆమెను అనుమతించలేదు.

కరోనా నేపథ్యంలో కేవలం యూఏఈ గుర్తింపు కార్డు ఉన్న వారి ప్రయాణాలపై ఆ దేశం నిషేధం విధించిందని, ప్రియా మెహతా వద్ద పౌరసత్వ గుర్తింపు కార్డు లేనందున తాము అనుమతించలేదని లుఫ్తాన్సా సంస్థ పేర్కొంది. మరోవైపు ఆ కార్డు అవసరం లేదని రెండు విమానయాన సంస్థలు చెప్పడంతోనే తాను టికెట్లు బుక్ చేసుకున్నానని, లేనిపక్షంలో అమెరికాలో ఉండిపోయేదానినని ప్రియా తెలిపారు. గత నాలుగు రోజులుగా లాంజ్‌లోనే ఉంటున్న ఆమె తనకు సహాయం కోసం దుబాయ్ సంస్థను ఆశ్రయించారు. వారు పంపిన పత్రాలను కూడా విమానయాన సంస్థ ఆమోదించడంలేదని, ఇప్పటి వరకు 13 సార్లు టికెట్లను మార్చుకున్నట్లు చెప్పారు. యుఏఈలో తనకు ఎవరూ లేరని తన తండ్రి భారత్‌లో ఉంటున్నారని ప్రియా మెహతా తెలిపారు.


logo