బుధవారం 03 జూన్ 2020
International - Apr 18, 2020 , 11:58:22

ఆల్ప్స్ ప‌ర్వ‌తాల్లో.. త్రివ‌ర్ణ రెప‌రెప‌లు

ఆల్ప్స్ ప‌ర్వ‌తాల్లో.. త్రివ‌ర్ణ రెప‌రెప‌లు

హైద‌రాబాద్‌: స్విట్జ‌ర్లాండ్‌లోని ఆల్ప్స్ ప‌ర్వ‌తాల్లో.. భార‌తీయ త్రివ‌ర్ణ ప‌తాకం రెప‌రెప‌లాడింది. మాట‌ర్‌హార్న్ ప‌ర్వ‌తంపై.. భార‌తీయ జాతీయ జెండా విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయింది.  క‌రోనాపై పోరాటానికి సంఘీభావంగా మ‌న దేశ ప‌తాకాన్ని.. ఆల్ప్స్ ప‌ర్వ‌తంపై ప్ర‌జ్వ‌లింప చేశారు.  ప్ర‌ఖ్యాత స్విస్ ఆర్టిస్ట్ గేరీ హాఫ్‌స్టెట్ట‌ర్ ఈ ఐడియాను అమ‌లు చేస్తున్నారు. వివిధ దేశాల జాతీయ ప‌త‌కాల‌ను అత‌ను ఆ ప‌ర్వ‌తంపై విద్యుత్ దీపాల‌తో వెలిగిస్తున్నారు.  మాట‌ర్‌హార్న్ పర్వ‌తం సుమారు 14,690 ఫీట్ల ఎత్తు ఉంటుంది. 

శుక్ర‌వారం రాత్రి భార‌తీయ త్రివ‌ర్ణ ప‌తాక రంగుల్లో.. ప‌ర్వ‌తంపై లైట్లు వెలిగాయి. మాట‌ర్‌హార్న్ కొండ‌.. స్విట్జ‌ర్లాండ్‌, ఇట‌లీ స‌రిహ‌ద్దుల్లో ఉంటుంది. అయితే ఈ ఫోటోల‌ను ఇండియ‌న్ ఫారిన్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ గుర్లీన్ కౌర్ ట్వీట్ చేశారు.  ఫ్రెండ్‌షిప్ ఫ్ర‌మ్ హిమాల‌యాస్ టు ఆల్ప్స్. థ్యాంక్యూ అంటూ ఆ ఆఫీస‌ర్ ట్వీట్ ఛేశారు.  మార్చి 24వ తేదీ నుంచి మాట‌ర్‌హార్న్ కొండ‌పై జాతీయ ప‌త‌కాల‌ను లైట్ల‌తో వెలిగిస్తున్నారు.   హోప్‌, సాలిడారిటీ, స్టే హోమ్ అన్న స్విస్ ప‌దాల‌ను కూడా ప‌ర్వ‌తంపై క‌నిపించేలా చేస్తున్నారు. 

మాట‌ర్‌హార్న్ ప‌ర్వ‌తం ఓ లైట్ హౌజ్ లాంటిద‌ని ఆర్టిస్టు హాఫ్‌స్టెట్ట‌ర్ తెలిపారు. వెలుతురు ఆశ‌ను రేకెత్తిస్తుంద‌ని, ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో లైట్లతో సందేశాన్ని ఇస్తే, ప్ర‌జ‌ల‌కు మ‌నం ఆశ‌ను క‌ల్పిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మాట‌ర్‌హార్న్ ప‌ర్వ‌తానికి ఎంతో చ‌రిత్ర ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఎన్ని వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం రోజుల్ని ప‌రిశీలించినా.. అప్పుడు క‌ళాకారులే ప్ర‌జ‌ల్ని ఒకే వేదిక‌పై తీసుకువ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఆర్ట్‌కు ఆ శ‌క్తి ఉంద‌న్నారు.

   logo