శనివారం 24 అక్టోబర్ 2020
International - Oct 16, 2020 , 18:45:24

స్నానం చేస్తుండ‌గా ప్ర‌స‌వం.. బాలుడిని బ‌య‌ట‌కు విసిరేసిన యువ‌తి

స్నానం చేస్తుండ‌గా ప్ర‌స‌వం.. బాలుడిని బ‌య‌ట‌కు విసిరేసిన యువ‌తి

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ న‌గ‌రంలో ఒక షాకింగ్ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బాత్రూంలో స్నానం చేస్తుండ‌గా ప్ర‌స‌వించిన ఓ యువ‌తి.. అప్పుడే పుట్టిన బాలుడిని బాత్రూం వెంటిలేట‌ర్ నుంచి బ‌య‌టికి విసిరేసింది. అనంత‌రం బాత్రూంను శుభ్ర‌ప‌ర్చి, స్నానం చేసుకుని వ‌చ్చి బెడ్రూంలో కునుకు తీసింది. ఇరుగుపొరుగు వారు బాలుడి ఏడుపు విని ఆస్ప‌త్రిలో చేర్పించారు. ప్ర‌స్తుతం బాలుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. న్యూయార్క్‌లోని క్వీన్స్ ఏరియాలో ఈ హృద‌యవిదార‌క ఘ‌ట‌న జ‌రిగింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లోని క్వీన్స్ ఏరియాలో భార‌త సంత‌తికి చెందిన అమెరికా 23 ఏండ్ల యువ‌తి స‌బితా దూక్ర‌మ్‌‌ భ‌ర్త‌తో క‌లిసి నివ‌సిస్తున్న‌ది. గ‌ర్భ‌వ‌తి అయిన ఆమె ఈ నెల 10న స్నానం చేస్తుండ‌గా బాత్రూంలో ప్ర‌స‌వించింది. వెంట‌నే బాలుడిని వెంటిలేట‌ర్‌లో నుంచి బ‌య‌ట‌ప‌డేసి బాత్రూంను శుభ్రంగా క‌డిగి, బెడ్‌రూంలోకి వెళ్లి నిద్ర‌పోయింది. అయితే బాలుడి ఏడుపు విని ఇరుగుపొరుగువారు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాలుడి మెద‌డుకు బాగా గాయాల‌య్యాయ‌ని, మెదడులో వాపు ఉంద‌ని వైద్యులు తెలిపారు. మ‌రికొన్ని గంట‌లు గ‌డిస్తేగానీ ఏమీ చెప్ప‌లేమ‌ని వెల్ల‌డించారు.

కాగా, ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌స‌వించిన విష‌యాన్ని కుటుంబ‌స‌భ్యులు ఎవ‌రికీ చెప్ప‌కుండా ఎందుకు దాచావ‌న్నపోలీసుల ప్ర‌శ్న‌కు స‌బితా దూక్ర‌మ్‌.. 'నేను బాత్రూంలోకి వెళ్లి స్నానం చేస్తుండ‌గా బాబు పుట్టాడు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు చాలా భ‌యం వేసింది. బాత్రూంలో ఉన్న క‌త్తెర‌తో బొడ్డుతాడు క‌ట్‌చేసి బాబును బ‌య‌టికి విసిరేశా. ఆ త‌ర్వాత నా దుస్తుల‌ను బాత్రూంలోని లాండ్రీలో ప‌డేసి, బాత్రూంను శుభ్రంగా క‌డిగి బ‌య‌టికి వ‌చ్చి బెడ్రూంలో ప‌డుకున్నా' అని సింపుల్‌గా చెప్పింది.

అయితే, స‌ద‌రు మ‌హిళ‌కు ఏ మాత్రం త‌ల్లి మ‌న‌సు లేక‌పోవ‌డంపై ద‌ర్యాప్తు అధికారులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. బిడ్డ‌ను చూసి భ‌యం వేసింద‌నడం విచిత్రంగా ఉందని స్థానికులు మండిప‌డుతున్నారు. ఇంత జ‌రిగినా ఇంట్లో వారికి విష‌యం చెప్ప‌కుండా, ఏమీ తెలియ‌న‌ట్టు బెడ్రూంలోకి వెళ్లి ప‌డుకోవడం ఏమిట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో స‌బితా దూక్ర‌మ్‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo