సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 29, 2020 , 07:59:18

సెల‌వే లేకుండా 38 ఏండ్లు నాన్‌స్టాప్‌గా పని

సెల‌వే లేకుండా 38 ఏండ్లు నాన్‌స్టాప్‌గా పని

లండన్: ఉద్యోగం చేసే వ్యక్తయినా.. సొంత వ్యాపారమైనా.. ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. వారమంతా కష్టపడి ఆ ఒక్కరోజు కుటుంబంతో కలిసి హాయిగా గడుపాలని భావిస్తారు. కానీ బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఏకంగా 38 ఏండ్లు (13,416 రోజులు) పని చేశారు. సముద్ర తీర పట్టణం షిర్లేలో 1982 అక్టోబర్‌లో చిన్న షాపు ప్రారంభించిన రాయ్ ఖర్బందా అనే భారతీయ బ్రిటిషర్‌ ఈ నెల 16న తొలిసారిగా షాపును బంద్‌ పెట్టాడు. రిటైర్మెంట్‌ తీసుకుంటానని ప్రకటించారు. 
దీంతో ఖర్బందా రిటైర్మెంటును స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు. కొందరు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖర్బందాను ఇంటర్వ్యూ చేయటానికి బ్రిటిష్‌ మీడియా పోటీ పడింది. తన కూతుళ్ల చదువుకోసమే ఇంతకాలం కష్టపడ్డానని, చదువుకు మించినది ఏదీ లేదని తెలిపారు. 
పెళ్లయిన 39 ఏండ్ల తర్వాత భార్య శశితో కలిసి హాలీడే విహారానికి వెళ్లేందుకు ఆయన ప్రణాళిక వేసుకుంటున్నారు. ‘1982 నుంచి నేను నా భార్యతోఎప్పుడూ ఎక్కువసమయం గడుపలేదు. నేను షాపులో ఉంటే, త‌ను ఇంట్లో ఉండేది. నాది కేవలం షాపు మాత్రమే కాదు. కమ్యూనిటీ సెంటర్‌లాగా కూడా సేవలు అందించింది. సొంతానికి సంపాదిస్తూనే ఇతరులకు సాయం చేయాలన్నదే నా సిద్ధాంతం’ అని ఖర్బందా పేర్కొన్నారు.


logo