బుధవారం 08 జూలై 2020
International - Jun 12, 2020 , 09:42:33

కోవిడ్‌ పేషెంట్‌కు ఊపిరితిత్తులు మార్పిడి సర్జరీ చేసిన భారతీయ డాక్టర్‌

కోవిడ్‌ పేషెంట్‌కు ఊపిరితిత్తులు మార్పిడి సర్జరీ చేసిన భారతీయ డాక్టర్‌

హైదరాబాద్‌: అమెరికాలో భారత సంతతి వైద్యుడు అరుదైన సర్జరీ చేశాడు. షికాగోలో కోవిడ్‌19తో బాధపడుతున్న ఓ యువతికి .. రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేశారు.  భారత సంతతి డాక్టర్‌ అంకిత్‌భారత్‌ నేతృత్వంలో ఈ సర్జరీ జరిగింది. షికాగోలోని నార్త్‌ వెస్ట్రన్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌లో ఈ శస్త్రచికిత్స జరిగింది. కోవిడ్‌19 పేషెంట్‌కు అమెరికాలో ఊపిరితిత్తులను మార్చడం ఇదే తొలిసారి. సుమారు పది గంటల పాటు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. యువతి  ఊపిరితిత్తులు ఎక్కువగా ఉబ్బడం వల్ల.. సర్జరీకి అనుకున్నదాని కన్నా ఎక్కువ సమయం పట్టింది. 

డాక్టర్‌ అంకిత్‌ భారత్‌..ఆ యువతి కేసు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.  సర్జరీ చేసిన యువతిలో కోవిడ్‌ లక్షణాలు సీరియస్‌గా లేవన్నారు. కానీ ఆమె కోలుకుంటున్నట్లు డాక్టర్‌ తెలిపారు. ప్రస్తుతం ఆ యువతి వెంటిలేటర్‌పై ఉన్నదని, కానీ ఆమె చాలా రోజుల నుంచి అస్వస్థతతో ఉన్న కారణంగా.. ఆమె ఛాతి కండరాలు బలహీనంగా ఉన్నట్లు డాక్టర్‌ చెప్పారు. పూర్తి స్థాయిలో ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని డాక్టర్‌ తెలిపారు. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఒక్కటే ఆమెకు ఉన్న ఆప్షన్‌ అని, అందుకే ఆమెకు ఆ సర్జరీ చేసినట్లు డాక్టర్‌ అంకిత్‌ వెల్లడించారు. కోవిడ్‌19తో బాధపడుతున్న పేషెంట్లకు చికిత్స ఇచ్చే హాస్పిటల్‌ ఈ సర్జరీపై దృష్టి పెట్టాలన్నారు.

ఊపిరితిత్తులు మార్పిడి చేయించుకున్న యువతి పేరును బహిర్గతం చేయలేదు.  20 ఏళ్ల వయసులో ఉన్న ఆ యువతి.. షికాగోలో ఉద్యోగం చేస్తున్నది. ఇటీవలే ఆమె నార్త్‌ కరోలినా నుంచి షికాగోకు వచ్చినట్లు తెలుస్తోంది. లాటిన్‌ నుంచి వలస వచ్చిన హిస్పానిక్‌ వర్గానికి చెందిన యువతి అని డాక్టర్లు తెలిపారు. కరోనా వైరస్‌ సోకక ముందు ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్‌ భారత్‌ తెలిపారు. ఏప్రిల్‌ 26వ తేదీన ఆమెను హాస్పిటల్‌లో చేర్పించారు. అంతకు రెండు వారాల ముందు నుంచి ఆమె అనారోగ్యంగా ఉన్నది. తొలుత ఆమెను వెంటిలేటర్‌పై పెట్టారు, ఆ తర్వాత నేరుగా రక్తంలోకి ఆక్సిజన్‌ అందించారు. కొన్ని వారాలు గడిచినా ఆమెలో ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్‌ జరగలేదు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు గ్రహించిన డాక్టర్లు .. ఇక సర్జరీకి ఏర్పాట్లు చేశారు. 20 ఏళ్ల యువతి ఇలా చావడం కరెక్ట్‌ కాదు అని, డాక్టర్లు అంతా ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని నిర్ణయించినట్లు భారత్‌ తెలిపారు.

నార్త్‌వెస్ట్రన్‌ మెడిసిన్‌ హాస్పిటల్‌లో ప్రతి ఏడాది 40 నుంచి 50 వరకు ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీలు చేస్తుంటారని డాక్టర్‌ భారత్‌ తెలిపారు. దాంట్లో ఎక్కువ సంఖ్యలో సర్జరీలను తానే చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా పరీక్షలో నెగటివ్‌ వచ్చిన తర్వాతనే ఆమెకు సర్జరీ చేసినట్లు తెలిపారు. మ్యాచింగ్‌ డోనార్‌ను గుర్తించిన కొన్ని రోజులకే శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు.  తాను సర్జరీ చేసిన అత్యంత బలహీనమైన పేషెంట్‌ ఈమే అని డాక్టర్‌ అంకిత్‌ భారత్ తెలిపారు.  

logo