బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 04, 2020 , 17:11:19

టైమ్స్‌ స్క్వేర్‌లో చైనా వ్యతిరేక ప్రదర్శన

టైమ్స్‌ స్క్వేర్‌లో చైనా వ్యతిరేక ప్రదర్శన

న్యూయార్క్: చారిత్రాత్మక టైమ్స్ స్క్వేర్‌లో భారతీయ-అమెరికన్ ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 'భారత్ మాతా కి జై' అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో.. చైనాను ఆర్థికంగా బహిష్కరించాలని, భారత్‌పై చైనా దూకుడుకు సంబంధించి దౌత్య స్థాయిలో వేరుచేయాలని డిమాండ్ చేశారు. 

న్యూయార్క్, న్యూజెర్సీలో నివసిస్తున్న భారతీయులు, 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్' (ఎఫ్ఐఏ) అధికారులు 'బాయ్‌కాట్‌ చైనా మేడ్ గూడ్స్', 'భారత్ మాతా కి జై', 'చైనీస్ దూకుడు ఆపాలి' వంటి నినాదాలు చేశారు. కరోనా వైరస్ గ్లోబల్ ఎపిడెమిక్ నేపథ్యంలో ముఖాలకు మాస్కులు ధరించి నిరసనకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. "అమరవీరులైన భారత సైనికులకు వందనం" అనే ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో టిబెట్ తైవాన్‌ దేశాలకు చెందిన ప్రజలు కూడా పాల్గొన్నారు. 'టిబెట్ స్టాండ్ విత్ ఇండియా', 'చైనీస్ వస్తువులను బహిష్కరించండి' అనే పోస్టర్‌లను ప్రదర్శించారు.  

"నేటి భారతదేశం 1962 భారతదేశానికి భిన్నంగా ఉంది. చైనా దురాక్రమణను, దాని బెదిరింపులను ఇక సహించం. చైనా అహంకారానికి తగిన సమాధానం ఇస్తాం" అని జైపూర్ ఫుట్ యూఎస్ఏ అధ్యక్షుడు భండారి అన్నారు. తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో హింసాత్మక వాగ్వాదంలో 20 మంది భారతీయ సైనికుల బలిదానం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని విచారం వ్యక్తం చేశారు.


logo