సోమవారం 18 జనవరి 2021
International - Dec 11, 2020 , 12:21:30

నాసా మూన్ మిష‌న్‌కు ఎంపికైన రాజా చారి

నాసా మూన్ మిష‌న్‌కు ఎంపికైన రాజా చారి

హైద‌రాబాద్‌: భార‌త సంత‌తికి చెందిన క‌ల్న‌ల్ రాజా చారి అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్నాడు. చంద్రుడి మీద‌కు వ్యోమ‌గాముల‌ను పంపాల‌నుకుంటున్న నాసా మిష‌న్‌కు అత‌ను ఎంపికయ్యాడు. అమెరికా వైమానిక ద‌ళంలో రాజా జాన్ వురుపుత్తూర్ చారి క‌ల్న‌ల్‌గా ప‌నిచేస్తున్నాడు.  ఈ మిష‌న్ కోసం నాసా మొత్తం 18  మందిని ఎంపిక చేసింది.  దాంట్లో సగం మంది మ‌హిళ‌లే ఉన్నారు.  2024లో చంద్రుడిపై మ‌నుషుల‌ను దింపాల‌ని నాసా భావిస్తున్న‌ది.  ఆ మిష‌న్‌లో భాగంగా ఒక ఆడ‌, ఒక మ‌గ ఆస్ట్రోనాట్‌ను నింగికి పంప‌నున్నారు. ఆర్టెమిస్ మూన్ ల్యాండింగ్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన 18 మంది వ్యోమ‌గాముల పేర్ల‌ను నాసా వెల్ల‌డించింది. రాజా చారికి రెండు వేల గంట‌ల పాటు విమానం తోలిన అనుభ‌వం ఉంద‌ని నాసా ఏరోనాటిక్స్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. 

మ‌సాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎంఐటీ) ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీలో రాజా చారి శిక్ష‌ణ పొందాడు.  యూఎస్ నావెల్ టెస్ట్ పైల‌ట్ స్కూల్‌లో శిక్ష‌ణ పొందిన ఏకైక భార‌త సంతతి వ్య‌క్తి కూడా ఇత‌నే కావ‌డం విశేషం.  ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాసుల కోసం నాసా అత‌న్ని 2017లో ఎంపిక చేసింది. తొలుత అవ‌స‌ర‌మైన ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ శిక్ష‌ణ కాలాన్ని అత‌ను పూర్తి చేశాడ‌ని, ఇప్పుడు రాజాచారి మూన్‌ మిష‌న్‌కు అర్హ‌త సాధించిన‌ట్లు నాసా వెల్ల‌డించింది.  ఆర్టెమిస్ ప్రాజెక్టుకు ఎంపికైన వ్యోమ‌గాముల పేర్ల‌ను ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ ఫ్లోరిడాలోని కెన్న‌డీ స్పేస్ సెంట‌ర్‌లో ప్ర‌క‌టించారు.