శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 20, 2020 , 20:49:12

చాబహార్ రైల్వే ప్రాజెక్టుపై సమీక్షకు భారత రాయబారిన ఆహ్వానించిన ఇరాన్

చాబహార్ రైల్వే ప్రాజెక్టుపై సమీక్షకు భారత రాయబారిన ఆహ్వానించిన ఇరాన్

టెహ్రాన్: ఇరాన్‌లోని చాబహార్-జహేదాన్ రైల్వే ప్రాజెక్టులో భారత్ సహకారం కొనసాగుతుందని ఆ దేశం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఇరాన్‌లోని భారత రాయబారి జీ ధర్మేంద్రను ఆ దేశ రవాణా శాఖ ఉపమంత్రి సయీద్ రసౌలి ఆహ్వానించారు. ఇరాన్‌లోని చాబహార్ పోర్టు వద్ద నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్టు నుంచి భారత్ తప్పుకున్నట్లు ఇటీవల ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని ఈ సందర్భంగా ఆయన మరోసారి ఖండించారు. దీని వెనుక కొందరి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు.

చాబహర్ పోర్టు రైల్వే ప్రాజెక్ట్‌పై భారత్‌తో ఎలాంటి ఒప్పందం లేదని ఇరాన్ ఇటీవల పేర్కొంది. ఈ ప్రాజెక్టు నుంచి భారత్ తప్పుకున్నట్లు ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని ఆ దేశం తప్పుపట్టింది. ఇరాన్‌లోని చాబహర్ పోర్టులో పెట్టుబడులకు సంబంధించి భారత్‌తో రెండు ఒప్పందాలు జరిగినట్లు ఆ దేశ పోర్టుల సంస్థకు చెందిన డిప్యూటీలో ఒకరైన ఫర్హాద్ మోంటాసెర్ తెలిపారు. పోర్టు యంత్రాలు, పరికరాలకు సంబంధించి ఒక ఒప్పందం, 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించి మరో ఒప్పందం కుదిరినట్లు ఆయన చెప్పారు. చాబహర్ పోర్టుకు సంబంధించి ఇరు దేశాల సహకారంపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. దీని గురించి భారతీయ పత్రికలో వచ్చిన కథనం పూర్తి అవాస్తవమని ఫర్హాద్ వెల్లడించారు.


logo