గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 03, 2020 , 19:43:39

బంగాళాఖాతంలో 'మలబార్‌' యుద్ధ క్రీడలు.. పాల్గొన్న భారత్‌, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా

బంగాళాఖాతంలో 'మలబార్‌' యుద్ధ క్రీడలు.. పాల్గొన్న భారత్‌, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో నాలుగు దేశాల నావికా యుద్ధ క్రీడలు "మలబార్ 2020" ప్రారంభమయ్యాయి. ఇండో పసిఫిక్‌లో బలమైన రక్షణ సహకారానికి నిబద్ధతగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మలబార్‌ యుద్ధక్రీడల విన్యాసాలను ట్వీట్ చేసింది. ఈ విన్యాసాల్లో భారత్‌తోపాటు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా తొలిసారిగా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నది. ఆస్ట్రేలియా హాజరుపై దాని మిత్రదేశమైన చైనా ఆగ్రహంతో ఉన్నది.

బంగాళాఖాతంలో నాలుగు దేశాల నౌకాదళాల యుద్ధక్రీడలు మలబార్‌-2020 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో చైనా సైనిక, ఆర్ధిక పరిధిని సమతుల్యం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ విన్యాసాలు చేపడుతున్నట్లుగా కనిపిస్తున్నది. ఇండో-పసిఫిక్‌లోని నాలుగు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల అనధికారిక సమూహమైన క్వాడ్‌లోని సభ్యులందరు.. ఈ ఏడాది మలబార్‌ విన్యాసాల్లో ఆస్ట్రేలియాను చేర్చడానికి అమెరికా, జపాన్‌తో భారత్‌ చర్చించి నిర్ణయించింది. యూఎస్ నేవీకి చెందిన జాన్ ఎస్ మెక్కెయిన్ క్షిపణి డిస్ట్రాయర్, ఆస్ట్రేలియా బల్లారట్ ఫ్రిగేట్, జపాన్ డిస్ట్రాయర్లు, జలాంతర్గామితో పాటు భారత నావికాదళానికి చెందిన ఐదు నౌకలను ఈ విన్యాసాల్లో మోహరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్ 6 వరకు కొనసాగనున్న మొదటి దశ కసరత్తుల్లో కొవిడ్‌-19 పరిమితుల కారణంగా నాలుగు దేశాల సైనిక సిబ్బంది మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఈ నెల చివర్లో భారత్‌, యూఎస్ విమానాలను క్యారియర్‌లలో మోహరించనున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

మిత్రదేశాల మధ్య ఉమ్మడి ఫ్రంట్‌ను ఏర్పరచుకునే ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్న అమెరికాను ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం గల, సైద్ధాంతిక పక్షపాత దేశం అని చైనా ఆరోపించింది. చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత్‌-చైనా మధ్య ఘర్షణల నేపథ్యంలో ఈ విన్యాసాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. పశ్చిమ హిమాలయాల్లో పెద్ద సంఖ్యలో దళాలను మోహరించారు. కరోనా వైరస్ మహమ్మారిపై అంతర్జాతీయ విచారణ కోసం కాన్బెర్రా నాయకత్వం వహించడంతోపాటు ఆస్ట్రేలియా గొడ్డు మాంసం, బార్లీపై చైనా వాణిజ్య ఆంక్షలు విధించిన తరువాత చైనా-ఆస్ట్రేలియా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. తూర్పు చైనా సముద్రంలోని ద్వీపాల యాజమాన్యంపై చైనాతో జపాన్‌ వివాదంలో చిక్కుకున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.